కరోనా కారణంగా హద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి కరోనా రోగులతో నిండిపోయింది. కరోనా కట్టడిలో అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారికి తన వంతు సాయంగా, ప్రతీరోజూ శీతల పానీయాలను అందిస్తూ, కరోనా వేళ మానవత్వం చాటుకుంటున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు గాంధీ ఆసుపత్రి వద్ద పారిశుధ్య కార్మికులు శేఖర్ కమ్ముల పేరిట ప్లకార్డులు ప్రదర్సిస్తూ లైన్ ఫామ్ చేశారు. తద్వారా శేఖర్ కమ్ములకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపే ప్రయత్నం చేశారు. అందుకు శేఖర్ కమ్ముల స్పందిస్తూ, ‘మీరు నాకు ఇచ్చిన ఈ బహుమతి వెల కట్టలేనిది. నేను చేసిన ఓ మంచి పని మిమ్మల్ని ఇంతలా కదిలించినందుకు చాలా సంతోషంగా ఉంది.
అయినా, మీరు చేసిన పని ముందు నేను చేసిన ఈ పని చాలా చాలా చిన్నది..’ అంటూ ట్విట్టర్ వేదికగా తన రెస్పాన్స్ తెలిపారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాటి మనిషికి సాయం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. సాయం పొందిన ప్రతి ఒక్కరూ తమకు సాయమందించిన వ్యక్తిని మననం చేసుకుంటూ తమకు తోచిన రీతిలో ఆ వ్యక్తి సంతోషాన్ని కోరుకుంటున్నారు.. ఇదిగో ఈ విధంగానే. ఇకపోతే, శేఖర్ కమ్ముల ప్రస్తుతం ’లవ్ స్టోరీ‘ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా కొంత పార్ట్ షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది. లాక్డౌన్ పూర్తి కాగానే రిమైనింగ్ షూటింగ్ పూర్తి చేసి, సినిమాని విడుదల చేయనున్నారు.