వరుస ఫ్లాపులతో తన ఇమేజ్‌నీ, తనపై ఉన్న నమ్మకాన్నీ పొగొట్టుకొన్నాడు శ్రీనువైట్ల. అమర్ అక్బర్ ఆంటోనీ అయితే ఫ్లాపులకు పరాకాష్ట. ఆ తరవాత శ్రీనువైట్ల సినిమా ఏదీ మొదలు కాలేదు. డీకి సీక్వెల్ గా డీ అండ్ డీ తీస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ అజాపజా లేదు. అయితే ఇప్పుడు శ్రీనువైట్ల పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఓ కథ పట్టుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నాడట. బడా హీరోలు ఎవరూ శ్రీనువైట్లకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. కుర్ర హీరోలకు తన దగ్గర ఉన్న కథ సరిపోదు. ఇప్పుడు గోపీచంద్ కోసం శ్రీనువైట్ల పడిగాపులు కాస్తున్నాడు.
గోపీచంద్ కామెడీ సినిమాలకు బాగానే సూటవుతాడు. లక్ష్యం, లౌక్యం ఇవన్నీ శ్రీనువైట్ల మార్కు కథలే. శ్రీనువైట్లతో గోపీచంద్ కాంబో కూడా బాగుంటుంది. అయితే గోపీచంద్ అయినా శ్రీనువైట్లని నమ్ముతాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. గోపీ కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి గోపీ రిస్కు తీసుకొనే పరిస్థితులో లేడు. గోపీచంద్ ఓకే అంటే.. సినిమాని వెంటనే పట్టాలెక్కించేద్దామన్నది శ్రీనువైట్ల ప్లాన్. మరి.. గోపీచంద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.