ఈరోజుల్లో ఒక్క ఫ్లాప్ వస్తేనే కెరీర్ అల్లకల్లోలం అయిపోతోంది. అలాంటిది ఫ్లాపుల మీద ఫ్లాపులు పడితే ఖేల్ ఖతం.. దుఖాన్ బంద్. ఆ హీరో జోలికి వెళ్లడానికే నిర్మాతలు భయపడిపోతుంటారు. ప్రస్తుతం గోపీచంద్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గోపీచంద్ ఖాతాలో హిట్టు పడి ఏళ్లకు ఏళ్లు అయిపోయింది. ఇటీవల విడుదలైన చాణక్య కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ ఫ్లాపు గోపీచంద్ కెరీర్‌పై పెను ప్రభావం చూపించింది.
ఆమధ్య గోపీచంద్ కొత్త సినిమా ఒకటి మొదలైంది. బివిఎస్ఎన్ప్రసాద్ నిర్మాత. చాణక్య ఫ్లాపుతో ఆ సినిమా ఆగిపోయింది. దానికి తోడు సంపత్‌నంది దర్శకత్వంలో రాబోయే సినిమా కూడా ఇప్పుడు డైలామాలో పడింది. గోపీచంద్ మార్కెట్ ప్రస్తుతం దారుణంగా ఉంది. తన సినిమాలకు ఓపెనింగ్సే రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గోపీతో సినిమా చేయడానికి ఏ నిర్మాతా సాహసించడు. అందుకే గోపీచంద్ చేతిలోని సినిమాలన్నీ మెల్లమెల్లగా వెనక్కివెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ ఖాళీ అనే చెప్పాలి.