'మహానాయకుడు' ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ బాలయ్య చేయబోయే నెక్ట్స్ సినిమా గురించి కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వస్తున్నాయి. ఆ గాసిప్స్‌ని ఖండించడానికి అక్కడెవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే బాలయ్యతో సినిమా చేయాల్సిన దర్శకుడు బోయపాటి శీను దాదాపుగా అజ్ఞాతంలో ఉన్నాడు 'వినయ విధేయ రామ' ఫలితంతో.
ఇక బాలకృష్ణ 'కథానాయకుడు' కారణంగా తగిలిన షాక్‌తో పూర్తిగా ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం 'మహానాయకుడు' సినిమాని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే టెన్షన్లోనే ఉన్నాడు బాలయ్య. జనవరి 25 నుండి ఫిబ్రవరి మొదటి వారానికి వెళ్లి, ఆ తర్వాత రిలీజ్ డేట్ మాయమైపోయింది 'మహానాయకుడు' విషయంలో.
మార్చి 1న వస్తుందని కొందరు, మార్చి నెలాఖరుకు రావచ్చని ఇంకొందరు అంటున్నారు. 'అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్‌లా 'మహానాయకుడు' మొత్తం రీషూట్ చేయాల్సి వస్తుందని ప్రచారం జరుగుతున్న దర్మిలా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పడం అంత తేలిక కాదు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ తదుపరి సినిమా గురించి వచ్చే ఏ పుకారునీ నమ్మే పరిస్థితి లేదని బాలయ్య సన్నిహితులు అంటున్నారు.