ఓ సినిమా హిట్టయితే.. 'అంతా నా వల్లే' అన్నట్టు గొప్పలు చెప్పుకుంటారు. ఫ్లాప్ అయితే మాత్రం 'ఇదంతా నీ వల్లే' అంటూ ఇంకొకరి నెత్తిమీద వేసేయాలని చూస్తుంటారు. ప్రస్తుతం 'వినయ విధేయ రామ' పరిస్థితీ ఇలానే ఉంది. రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. పంపిణీదారులకు ఏకంగా 30 కోట్ల నష్టాలు వాటిల్లాయి.
కథానాయకుడు రామ్ చరణ్ సైతం తన సినిమా నిరాశ పరిచిందని ఒప్పుకున్నాడు. అంతేకాదు... క్షమించమని కోరుతూ అభిమానులకు ఓ లేఖ రాశాడు. అయితే... చిత్రబృందంలో ఇప్పుడు లుకలుకలు మొదలైపోయాయి. ఈ ఓటమికి బాధ్యత నీదంటే నీదంటూ దర్శకుడు, నిర్మాత మాటల యుద్ధానికి దిగారట. దానయ్య, బోయపాటి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయని, ఇద్దరూ ఓ సందర్భంలో హద్దు మీరి గొడవకు దిగారని ఇన్‌సైడ్ వర్గాల టాక్.
ఈ సినిమా కోసం బోయపాటి ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకున్నాడు. నష్టాలొచ్చాయి కాబట్టి.. కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వమని బోయపాటిని కోరాడట నిర్మాత. దానికి బోయపాటి శ్రీను ససేమీరా అనడంతో గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ టోటల్ ఎపిసోడ్‌లో... చరణ్ నిర్మాత దానయ్య వెనకే ఉండడం విశేషం. మొత్తానికి ఓ ఫ్లాప్ దర్శకుడు, నిర్మాత మధ్య అగ్గి రగిల్చింది. ఇటు బోయపాటికీ, చరణ్‌కీ మధ్య కనెక్షన్లు ఎప్పుడో కట్ అయిపోయాయని టాక్.