కరోనా - లాక్ డౌన్ వల్ల అతలాకుతలమైన తెలుగు చిత్రసీమని మళ్లీ నిలబెట్టేందుకు, కార్యక్రమాలను సజావుగా సాగేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతోంది పరిశ్రమ. అందుకోసం పలు దఫాలుగా మీటింగులు ఏర్పాటు చేసింది. మంత్రి తలసాని యాదవ్ తో పలుమార్లు సమావేశమైన పరిశ్రమ ప్రముఖులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఓ సారి ములాఖత్ అయ్యారు. అయితే ఈ మీటింగులకు నందమూరి బాలకృష్ణ హాజరు అవ్వలేదు.
ఇండ్రస్ట్రీలోని అగ్రజులలో బాలయ్య ఒకడు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఓ తరం హీరోలు. ఓరకంగా ఇండ్రస్ట్రీ పెద్ద దిక్కు. అలాంటప్పుడు బాలయ్య ఈ కూటమిలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. `నన్ను ఎవరూ పిలవలేదు. పేపర్లలో చూస్తేనే మీటింగులు జరుగుతున్నాయని అర్థమైంది` అని బాలయ్య చెప్పేయడంతో - ఈ మీటింగులకు బాలయ్యని ఎవరూ పిలవలేదని తేలిపోయింది. బాలయ్య ఆ మాటతో ఆగిపోతే బాగుణ్ణు.. `భూములు పంచుకుంటున్నారా` అని నోరుజారడంతో - అసలు వివాదం మొదలైంది. టోటల్ గా ఈ వ్యవహారం మొత్తం కొత్త మలుపు తిరిగింది. బాలయ్య అక్కసుతో అన్నారా? లేదంటే నిజంగానే ఇండ్రస్ట్రీ పెద్దలు తమ భూముల్ని కాపాడుకోవడానికి - తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నారా? అనేది మరో కొత్త టాపిక్కు. అయితే.. ఈ వ్యవహారంలో ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇండ్రస్ట్రీలో ఇంకా గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతానికి బాలయ్యది ఓ గ్రూపు. మిగిలిన వాళ్లది మరో గ్రూపులా తయారైంది. దీనిపై మిగిలిన వాళ్లు ఎలా స్పందిస్తారన్నది కీలకం. కొద్ది రోజులుగా పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. కెప్టెన్ కుర్చీలో కూర్చని ప్రభుత్వానికీ చిత్రసీమకూ సారధిలా మారారు. అలాంటప్పుడు నేరుగా ఈ విమర్శ చిరంజీవిని తాకిట్టైంది. దానికి ఆయన తీసుకుంటారన్నదాన్ని బట్టి వివాదం ఇంకా ముదురుతుందా, లేదంటే.. ఇక్కడితో ఆగిపోతుందా అనేది ఆధార పడి వుంది.