'గుండు' హనుమంతరావు పేరు చెప్పగానే నవ్వు తన్నుకొస్తుంది. ఆహ్లాదకరమైన నవ్వుకి చిరునామా ఆయన. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నవ్వుల్ని పంచిన గుండు హనుమంతరావు, అందర్నీ విషాదంలో ముంచేశారిప్పుడు. అనారోగ్యంతో గుండు హనుమంతరావు మరణించారన్న వార్త తెలుగు ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది.
ఇటీవల గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారన్న వార్తతో తెలుగు సినీ పరిశ్రమతోపాటు, తెలుగు సినీ ప్రేక్ష లోకం కూడా ఆవేదన చెందింది. అయితే, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు గుండు హనుమంతరావుకి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించడం, తెలంగాణ ప్రభుత్వమూ ఈ విషయంలో ముందుకు రావడంతో, ఆయన కొంత కోలుకున్నారు. పూర్తిగా కోలుకుని, మళ్ళీ ఆయన సినిమాల్లో నటిస్తారని అందరూ భావించారుగానీ, విధి వెక్కిరించింది. నవ్వుల 'గుండు'ని మనకిక లేకుండా చేసింది.
ఈ రోజు తెల్లవారు ఝామున తీవ్ర అనారోగ్యంతో గుండు హనుమంతరావు తుదిశ్వాస విడిచారు. గుండు హనుమంతరావు మరణ వార్త పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హైద్రాబాద్‌లోని గుండు హనుమంతరావు ఇంటికి చేరుకుని, ఆయన పార్తీవ దేహానికి సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.
నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన గుండు హనుమంతరావు, సుమారు 400కి పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించారు. బుల్లితెరపైనా 'అమృతం' సీరియల్‌తో తనదైన ముద్ర వేశారాయన. హాస్యానికి చిరునామా అన్పించుకున్న గుండు హనుమంతరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.