'జిప్సి' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : జీవ, నటాషా సింగ్, లాల్ జొస్ తదితరులు 
దర్శకత్వం :  రాజు మురుగన్
నిర్మాత‌లు : అంబెత్ కుమార్
సంగీతం : సంతోష్ నారాయణ్, సుశీల రామన్ 
సినిమాటోగ్రఫర్ : సెల్వ కుమార్
ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాష్ట  


రేటింగ్‌: 2.75


ప్ర‌తీ శుక్ర‌వారం ఓ కొత్త సినిమా వ‌చ్చేది. థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడేవి. క‌రోనా పుణ్యంతో...ఆ  వినోదానికి దూర‌మ‌య్యాడు స‌గ‌టు ప్రేక్ష‌కుడు. ఇప్పుడంతా ఓటీటీనే. ఇక్క‌డ కూడా శుక్ర‌వారం ఓ కొత్త సినిమా విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న‌ల్లో ఉన్నారు నిర్మాత‌లు. ఓర‌కంగా... ఓటీటీ థియేటర్లు లేని లోటు తీరుస్తోంద‌నుకోవొచ్చు. ప్ర‌తీవారం ఏదో ఓ ఓటీటీ వేదిక‌పై.. ఓ సినిమా క‌నిపిస్తోంది. ఈసారి 'జిప్పీ' వంతు వ‌చ్చింది. ఇదేం తెలుగు సినిమా కాదు. త‌మిళ సినిమా. కానీ.. తెలుగు డ‌బ్బింగ్ తో `ఆహా`లో విడుద‌లైంది. 'రంగం' లాంటి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న జీవా క‌థానాయ‌కుడిగా న‌టించాడు. మ‌రి ఈసినిమా ఎలా ఉంది?  ఏం చెప్పింది? ఓటీటీలో అయినా చూడొచ్చా?  


* క‌థ‌


జిప్సి (జీవా) అనాథ‌. ఓ సంచారి జిప్సీ ని సాకుతాడు. అత‌నితో పాటు.... దేశం, ప్ర‌పంచం అంతా చుట్టొస్తాడు పిప్సి. త‌న‌కు ఓ ఇల్లూ, వాకిలీ ఉండ‌దు. సంసార ల‌క్ష‌ణాలేం ఉండ‌వు. అవ‌న్నీ అడ్డుగోడ‌లు అనుకుంటాడు. అలాంటి జిప్సి వ‌హిదా (న‌టాసా సింగ్‌) అనే ముస్లిం అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిపోతాడు. వ‌హిదా కూడా జిప్సిని ప్రేమిస్తుంది. వ‌హిదాకి ఇంట్లో పెళ్లి ఖాయం చేస్తారు. ఆ పెళ్లి నుంచి త‌ప్పించి.. జిప్సి, వ‌హిదా - పారిపోతారు. కొత్త జీవితం మొద‌లెడ‌తారు. ఆ త‌ర‌వాత‌... జిప్సి - వ‌హిదా జీవితాల్లో ఎదురైన ఆటుపోట్ల స‌మాహార‌మే ఈ క‌థ‌.


* విశ్లేష‌ణ‌


రాజు మురుగ‌న్‌.. తొలి సినిమా (జోక‌ర్‌)తో జాతీయ అవార్డు సంపాదించాడు. అలాంటి ద‌ర్శ‌కుడి సినిమా అనేస‌రికి సాధార‌ణంగా కొన్ని అంచ‌నాలు ఏర్ప‌డ‌తాయి. ప్ర‌చార చిత్రాలు, అందులో క‌థానాయ‌కుడి పాత్ర స్వ‌భావం చూశాక‌... ఆ న‌మ్మ‌కాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయి. ఓ సంచారి క‌థ ఇది. సంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన జీవితం అల‌వాటు లేని - వ్య‌క్తి క‌థ‌. అలాంటి వ్య‌క్తికి ఓ సాధార‌ణ అమ్మాయి ప‌రిచ‌యం అయితే, ఇద్ద‌రూ క‌లిసి బ‌త‌కాల‌నుకుంటే.. అనేది నిజంగా కొత్త పాయింట్‌. ఇలాంటి క‌థ‌లు సాధార‌ణంగా మ‌న తెర‌ల‌పై చూడ‌లేదు. కాబ‌ట్టి... ద‌ర్శ‌కుడు ఓ కొత్త ఆలోచ‌న‌నే ప‌ట్టుకున్నాడు. హీరో పాత్ర చిత్ర‌ణ‌, ప్రారంభ స‌న్నివేశాలు త‌ప్ప‌కుండా ఈ క‌థ‌పై ఉత్సుక‌త‌ని క‌లిగిస్తాయి.


ఓ సంచారి జీవితం ఎలా సాగుతుంది?  అత‌ని ప్ర‌యాణాల అనుభ‌వాలేంటి?  ఇవ‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. క‌థ‌లో ప్రేమ అనే వ‌స్తువు ఎప్పుడు ప్ర‌వేశిస్తుందో అక్క‌డి నుంచి... భావోద్వేగాలు మొద‌ల‌వుతాయి. ఆ ప్రేమ క‌థ‌నీ సున్నితంగానే డీల్ చేశాడు ద‌ర్శ‌కుడు. మ‌త ఘ‌ర్ష‌ణ‌లు, హిందూ - ముస్లిం విబేధాలూ ఇవ‌న్నీ చూస్తుంటే `బొంబాయి` సినిమా గుర్తొస్తుంది. అక్క‌డ‌క్క‌డ మ‌రికొన్ని ప‌రాయి సినిమాల ఛాయ‌లు క‌నిపిస్తాయి. అయితే ద‌ర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని వీలైనంత వ‌ర‌కూ నిజాయ‌తీగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.

 

క‌మ‌ర్షియాలిటీ కోసం క‌థ‌ని దాటి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం అభినందించ ద‌గిన విష‌యం. అయితే చాలా స‌న్నివేశాలు లెంగ్తీగా సాగుతాయి. అవ‌స‌రం లేని విష‌యాన్ని కూడా ప‌దే ప‌దే బ‌లంగా చెప్పాల‌న్న ఆత్రుత క‌నిపిస్తుంది. ఇవ‌న్నీ ప్రేక్ష‌కుడి మూడ్ ని దెబ్బ‌తీసేవే. క్లైమాక్స్ నిరాశ ప‌రుస్తుంది. ఏదో చెప్పాల‌నుకుని, ఏదో చెప్పాడేమో అనిపిస్తుంది.
క‌థ‌లో కాన్‌ఫ్లిక్ట్ చాలా చిన్న‌ది. దాన్ని సైతం స‌రైన రీతిలో ఆవిష్క‌రించ‌లేదు.


* న‌టీన‌టులు


జీవా గెట‌ప్ కొత్త‌గా క‌నిపిస్తుంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అల్లుకుపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న మ‌రింత న‌చ్చుతుంది. ఇలాంటి కొత్త పాత్ర‌లు అన్వేషించుకుంటూ తాను సాగిస్తున్న ప్ర‌యాణాన్ని అభినందించాల్సిందే. న‌టాషా సింగ్ అందంగా ఉంది. త‌న ప‌రిధి మేర న‌టించింది. మిగిలిన‌వాళ్లంతా పాత్ర‌ల‌కు త‌గిన‌ట్టు రాణించారు.


* సాంకేతిక విభాగం


ఫొటోగ్ర‌ఫీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ప్ర‌పంచంలోని అందాల్ని కెమెరాలో బంధించారు. కాశ్మీర్ ని మ‌రోసారి చూడాల‌నిపించేలా కొన్ని స‌న్నివేశాల్ని ముగ్థ‌మ‌నోహ‌రంగా తీర్చిదిద్దారు. సంగీతానికి ప్రాధాన్యత ఉంది. పాట‌లేం గుర్తుండ‌వు గానీ, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ లో వైవిధ్యం ఉంది. అయితే స‌రైన సంఘ‌ర్ష‌ణ లేక‌పోవ‌డం, చెప్పాల‌నుకున్న పాయింట్ నుంచి డీవియేట్ అయిపోవ‌డం వ‌ల్ల ఫ‌లితం ద‌క్క‌లేదు.


* ప్ల‌స్ పాయింట్స్‌

కథా నేప‌థ్యం
ఫొటోగ్ర‌ఫీ


* మైన‌స్ పాయింట్స్‌
సంఘర్ష‌ణ లేక‌పోవ‌డం
క్లైమాక్స్‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ఓ సంచారి క‌థ‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS