హీరోయిన్ల తీరు మారిపోయింది. వాళ్ల కెరీర్‌కు పెళ్లి అడ్డే కాదు. సమంత ని చూడండి. పెళ్లయ్యాక దూకుడు మరింత పెంచింది. అఫ్‌కోర్స్ ఆ తరవాత విడాకులు తీసుకోవాల్సివచ్చిందనుకోండి.. అది వేరే విషయం. కాజల్ కూడా అంతే. పెళ్లికీ, చేసే పనికీ ఏ మాత్రం సంబంధం లేదంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు హన్సిక పరిస్థితీ ఇంతే. డిసెంబరు 4న హన్సిక పెళ్లి జరగబోతోంది. తన స్నేహితుడు, ప్రేమికుడు, బిజినెస్ పార్టనర్ సోహైల్ ని వివాహమాడుతోంది హన్సిక. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది.
అయితే పెళ్లయ్యాక సినిమాలకు దూరం కానంటోంది. పెళ్లి తరవాత కూడా తాను నటిస్తానంటోంది. ``మనం చేసే ప్రతీ పనీ పవిత్రమైనదే. పనికీ, పెళ్లికీ సంబంధం లేదు. పెళ్లి చేసుకొన్నా.. నటించడానికి నాకేం అభ్యంతరం లేదు. సోహైల్ కూడా.. ఈ విషయంలో నన్ను ప్రోత్సహిస్తాడు. తనకు సినిమా రంగం పై అవగాహన ఉంది. ఈ విషయంలో మేమిద్దరం ఇది వరకే మాట్లాడుకొన్నాం`` అని హన్సిక చెబుతోంది. అయితే... హన్సిక టైమ్ ఏమాత్రం బాలేదు. తనకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. చేసిన సినిమాలు బోల్తా కొడుతున్నాయి. యువ కథానాయికలతో హన్సిక పోటీ పడలేకపోతోంది. తనకు నటించాలని ఉన్నా... పెళ్లయ్యాక హన్సిక కు అవకాశాలు వస్తాయా అనేది అనుమానమే.