వైకాపా కోసం ప్రచారం చేసిన వాళ్లలో పోసాని కృష్ణమురళి పేరు కూడా ప్రస్తావించుకోవాల్సిందే. ఆయన వైకాపా జెండా మోశారు. ఆ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. వైకాపా కోసం.. హద్దు దాటి మరీ ఆవేశ పడిపోయిన సందర్భాలున్నాయి. పవన్ కల్యాణ్‌పై అందుకొన్న బూతు పురాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన తిట్టి పోశారు. దాంతో... తెలుగు సినిమాల్లో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కూడా చెబుతుంటారు. అయితేనేం..? ఇప్పుడు ఆయన కష్టం ఫలించింది. ఏపీ ప్రభుత్వం ఆయనకో కీలకమైన పదవి ఇచ్చింది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డవలెప్ మెంట్ కార్పొరేన్‌కు ఛైర్మన్ గా పోసానిని నియమించారు. ఇటీవల అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్ట్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దాంతో పోలిస్తే పోసాని పదవి, హోదా చాలా బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఛైర్మన్ గా పోసానికి నెలకు కనీసం 4 నుంచి 5 లక్షల జీతం వస్తుందని, ఇతర ప్రభుత్వ ఎలవెన్సులు లభిస్తాయని సమాచారం. దాదాపుగా ఎం.ఎల్.ఏ స్థాయి సదుపాయాలు పోసానికి అందుతాయి. వైకాపా ఎం.ఎల్.ఏ అవ్వకపోయినా... ఆ స్థాయి హోదా దక్కించుకొన్నారు పోసాని. ఇన్నాళ్ల పోసాని కష్టం ఫలించిందని, తాను నమ్ముకొన్న పార్టీనే ఇప్పుడు ఆదుకొందని ఆయన అభిమానులు అంటున్నారు. కాకపోతే... ఇండస్ట్రీ నుంచి పోసానికి శుభాకాంక్షలు చెప్పిన వాళ్లు ఒక్కరూ లేరు. పోసాని చేపట్టింది చిత్రసీమకు లింకున్న పోస్టు. అయినా సరే.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బహుశా.. పోసానిపై పడిన బ్యాడ్ మార్కే అందుకు కారణమేమో..?