నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ ఈమధ్య 'గబ్బర్ సింగ్' సినిమా విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్న సంగతి తెలిసిందే. రీమేకులు తప్ప స్ట్రెయిట్ సినిమాలు తీయలేడని, హరీష్ శంకర్ తో ఎప్పటికీ సినిమా నిర్మించనని అప్పట్లో బండ్ల ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక హరీష్ కూడా తనదైన శైలిలో బండ్లకు కౌంటర్లు ఇచ్చారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఎపిసోడ్ గురించి బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తే ఎంతో సాఫ్ట్ గా మాట్లాడి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో హరీష్ శంకర్ తో సినిమా చేస్తారా? అని అడిగితే తమ మధ్య జరిగింది అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య వచ్చే చిన్న గొడవ లాంటిదని, హరీష్ మంచి డైరెక్టర్ అని చెప్పారు. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయనని ప్రశ్నించారు. ఆయన అవకాశం ఇవ్వడమే అదృష్టమని చెప్పారు. ఆ రోజు కోపంలో అలా అన్నానని, అప్పుడప్పుడు ఇంట్లో పిల్లల మీద కోప్పడుతుంటా, భార్య మీద కూడా కోప్పడుతుంటానని ఇదీ అలాంటిదేనన్నారు. ఏదో మాటా మాటా అనుకుంటే మనం వాళ్లు కాకుండా పోతారా? అన్నదముల్లాంటి వాళ్ళం.. ఏదో కోపంలో అరుచుకున్నాం. అది చిన్న చిన్న ఈగోలతో వచ్చిన గొడవ. దాని గురించి ఆలోచించడం వేస్ట్ అన్నారు.
ఈ విషయంపై స్పందించిన హరీష్ "నేను బండ్ల గణేష్ ను ఎప్పుడూ గౌరవిస్తాను. 'గబ్బర్ సింగ్' కోసమే కాదు, 'మిరపకాయ్' కంటే ముందే నాతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉండేవాడు. ఆయన కరోనా నుంచి రికవర్ కావడం సంతోషం" అని వివాదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టారు.