కరోనా ఎంత పని చేస్తోంది. కోట్లకు కోట్లు ఎసరు పెడుతోంది. షూటింగులు ఆగిపోయాయి. సినిమాలు ఆగిపోయాయి. స్క్రిప్టులు మార్చి రాసుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని సీన్లు.. కరోనా కారణంగా చెత్త బుట్టలో వేయాల్సివస్తోంది. ఇదంతా కరోనా వల్లే.
ఈ ఎఫెక్ట్ 'పుష్ష'పై కూడా పడింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. లాక్ డౌన్ లేకపోతే.. దాదాపు పావు సినిమా పూర్తయ్యేది. లాక్ డౌన్‌కి ముందు కేరళలో కొన్ని సన్నివేశాలు తీశారు. అక్కడే కొత్త షెడ్యూల్ కూడా మొదలు కావాల్సింది. అయితే కరోనా వల్ల సమస్యలు వచ్చి పడ్డాయి. కేరళలో షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. కేరళలో అంత తేలిగ్గా అనుమతులు ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు `పుష్ష` ప్లానింగ్ అంతా మారిపోయింది. కేరళలో తీయాల్సిన సన్నివేశాల్ని తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కేరళలో తీసిన సన్నివేశాలు వృథా అయినట్టే. ఆ సన్నివేశాల్ని తూ.గో.జిల్లాలో మళ్లీ రీషూట్ చేయాలి. దాని వల్ల రూ.3 కోట్ల నష్టం వాటిల్లబోతోందని తెలుస్తోంది. పుష్షకి మాత్రమే కాదు. చాలా సినిమాలకు ఇలాంటి సమస్యలున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులకు అనుమతి వస్తే, ఏ రాష్ట్రంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయన్న సంగతి ఓ కొలిక్కి వస్తే... అప్పుడు ఏ సినిమా ఎంత నష్టోపోయిందన్న సంగతులు బయటకు వస్తాయి.