లాక్ డౌన్ 4.0 నడుస్తోందిప్పుడు. కనీసం. మే 31 వరకూ సినిమా థియేటర్ల తాళాలు తెరచుకోవు. ఆ తరవాత కూడా సందేహమే. కరోనా ఉధృతి కొంత కూడా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు లభిస్తాయనుకోవడం అత్యాసే అవుతుంది. థియేటర్లు తెరచుకోవడానికి కనీసం ఓ నెల ముందు షూటింగులకు అనుమతి లభిస్తుందని సమాచారం. అంటే రాబోయే నెల రోజుల్లోనూ థియేటర్లు తెరచుకోవన్నది స్పష్టం. కేంద్రం కూడా 'సినిమా'ని చిట్ట చివరి ప్రాధాన్యతల లిస్టులో చేర్చేసింది. సినిమా అనేది వినోద సాధనం మాత్రమే. అవసరం కాదు.
ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రజల అవసరాలపైనే దృష్టి పెడుతోంది. ప్రజా రవాణాకు సైతం పూర్తి పచ్చ జెండా ఊపలేదు. రాష్ట్రాల ఇష్ట ప్రకారమే బస్సులు నడుపుకునే స్వేచ్ఛ ఇచ్చింది. రైళ్లూ, విమానాలు, హోటెళ్లు, స్టేడియాలు, షాపింగ్ మాళ్లూ.. ఈ లాక్ డౌన్‌లో తెరచుకోవు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆగస్టులోనే థియేటర్లు తెరచుకునే అవకాశం ఉంది. ఈ మేరకు చిత్రసీమకు ప్రభుత్వం ముందే హింట్ ఇచ్చినట్టు సమాచారం.
థియేటర్లు తెరచుకుంటే తమ సినిమాల్ని విడుదల చేసుకోవచ్చని దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ ముందస్తు సమాచారం అందిస్తే కనీసం ఓ టీ టీలకైనా తమ సినిమాల్ని అమ్ముకునే ఛాన్సుంది. అందుకే ఆగస్టు వరకూ థియేటర్లు తెరవబోమని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కొంతమంది నిర్మాతలతో ఫోన్‌లో మాట్లాడారని, ఆగస్టు వరకూ ఆశల్లేవని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోమని చెప్పేశారని తెలుస్తోంది. సో.. నిర్మాతలంతా ఇప్పుడు ఓ టీ టీ వైపు చూడాల్సిందే.