మా' ఎన్నికలు అనగానే అధ్యక్ష పదవి కోసం చాలా పోటీ మొదలైంది. విష్ణు, ప్రకాష్రాజ్లతో పాటుగా జీవిత, హేమ కూడా `నేను సైతం` అంటూ ముందుకొచ్చారు. వారిద్దరూ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడతామని ప్రకటించారు. ఇప్పుడు ఓ కొత్త ట్విస్ట్ ఇస్తూ... వీరిద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో మాత్రం జీవిత, హేమ పేర్లు కనిపించాయి. జనరల్ సెక్రటరీగా జీవిత, ఉపాధ్యక్షురాలిగా హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేస్తున్నారు.
``హేమ అధ్యక్ష ఎన్నికలలో పాల్గొందామనే అనుకున్నారు. అయితే నా భావాలు నచ్చి నా ప్యానల్ లో చేరడానికి ముందుకొచ్చారు. జీవిత కూడా అంతే. ఆమె కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వీరిద్దరూ అనుభవజ్ఞులు. అందుకే మా ప్యానల్ లో తీసుకున్నాం`` అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకాష్ రాజ్ `మా బిడ్డలు` ప్యానల్ సభ్యుల పేర్లు ప్రకటించారు. ప్రధాన ప్యానల్ లో 8 మంది సభ్యులు, ఈసీ మెంబర్లుగా మరో 18 మంది పోటీ చేస్తున్నారు.