కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అదృష్టం కలిసొచ్చి, అన్నీ కుదరితే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్స్ అయిన సందర్భాలు గతంలో అనేకం చూశాం. అలా ‘ఓ పిట్టకథ’మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. విశ్వంత్, సంజయ్ రావ్, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. పల్లెటూరి ప్రశాంత వాతావరణంలోని ఆహ్లాదకరమైన పచ్చ పచ్చని లొకేషన్లు మనసుకు సరికొత్త ఉల్లాసాన్నివ్వడంతో పాటు, సినిమాలోని కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల మదిని దోచుకునేలా ఉందనుందని ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంతా.
ఇదిలా ఉంటే, లవర్స్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఏమైపోతానే..’ సాంగ్ గురించి ఈ మధ్య కాస్త ఎక్కువే మాట్లాడుకుంటున్నారు. ఈ పాటను పాట లేకుండానే విజువల్స్ క్యాప్చర్ చేశారట. సహజంగా అయితే, పాటకు తగ్గట్లుగా విజువల్స్ క్రియేట్ చేస్తారు. కానీ, అందుకు రివర్స్‌లో ముందుగా పాటని చిత్రీకరించేసి, తర్వాత ట్యూన్స్ సిద్ధం చేశారట. గోదావరి జిల్లాల్లోని లైవ్ లొకేషన్స్‌లో క్యాప్చర్ చేసిన ఈ సాంగ్ సినిమాకి హైలైట్ కానుందని అంటున్నారు. అంతేకాదు, అప్పుడెప్పుడో వంశీ సినిమా పాటల్లో ఉండే ప్రెజన్స్‌ని ఈ పాట గుర్తు చేయనుందని అంటున్నారు. ఇలా ఈ ‘పిట్టకథ’ గురించి పెద్ద కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అసలు కథేంటో తెలియాంటే మార్చి 6 వరకూ చూడాల్సిందే.