శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - టాలీవుడ్ లో తిరుగులేని సంస్థ. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందించిన సంస్థ. మైలు రాయి లాంటి సినిమాల్ని పరిశ్రమకు ఇచ్చింది. సూపర్ స్టార్ లతో పని చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే ఓ బ్రాండ్‌లా మారిపోయింది. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్.. ఈ ముగ్గురూ ఈ సంస్థకు మూలస్థంభాలు. అయితే ఈ బంధానికి బీటలు వారింది. ఈ సంస్థలో కీలకంగా వ్యవహరించే వాటాదారుడు లక్ష్మణ్ - దిల్ రాజుకి గుడ్‌బై చెప్పేశాడు. ఇప్పుడు సొంత కుంపటి పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు.
అవును.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి లక్ష్మణ్ బయటకు వచ్చేశాడు. ఇక నుంచి ఆయన దిల్ రాజుతో పనిచేయాలని అనుకోవడం లేదు. సొంతంగా ఓ బ్యానర్ స్థాపించి, సినిమాలు తీయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. సినిమాల్ని సొంతంగా పంపిణీ చేయాలన్న నిర్ణయానికీ వచ్చినట్టు సమాచారం. లక్ష్మణ్ కి ఎదిగొచ్చిన ఓ కుమారుడు ఉన్నాడు. తనని నిర్మాతగా పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. సో.. దిల్‌రాజు కుడి భుజంలా ఉండే లక్ష్మణ్ ఇక దిల్‌రాజుతో ప్రయాణం చేయడన్నమాట. మరి.. లక్ష్మణ్ లేకుండా దిల్‌రాజు ఎలా నెగ్గుకొస్తాడో, సొంత కుంపటి పెట్టి లక్ష్మణ్ ఏం సాధిస్తాడో చూడాలి.