ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన 'V' త్వరలో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల కానుంది. సెప్టెంబర్ 5వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వారు ప్రకటించారు. థియేటర్లు మూతపడి ఇప్పటికీ దాదాపు అయిదు నెలలు అయ్యాయి. థియేటర్లు త్వరలో తెరుస్తాం అని అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది చిన్న సినిమాల నిర్మాతలు ఓటీటీ వేదికల ద్వారా తమ సినిమాలను డైరెక్ట్ రిలీజ్ రెడీ అయ్యారు. కొన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ కూడా అయ్యాయి.
అయితే ఆ సినిమాలన్నీ దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ లోపు ఉండేవి. పెద్ద సినిమాలు ఏవీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. దాదాపు రూ. 30 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిన 'V' ఓటీటీ లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు బిగ్ బడ్జెట్ సినిమా అనుకోవాలి. ఈ సినిమాకు కనుక మంచి రెస్పాన్స్ వస్తే, భారీగా వ్యూస్ నమోదైతే ఓటీటీ వేదికల వారు భవిష్యత్తులో తెలుగు సినిమాలకు భారీ మొత్తాలు చెల్లించి ఆ హక్కులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా రెస్పాన్స్ పెద్దగా లేకపోతే భారీ డీల్స్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో సాధారణ ప్రేక్షకుల కంటే కూడా తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులు ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ వేదికల నుంచి మంచి ఆఫర్లు వస్తాయని, ఈ సినిమా హిట్ కావాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది అనే సంగతి ఇ తెలిసేందుకు మనం కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.