నాని నిర్మాతగా రూపొందించిన `హిట్`ఈ శుక్రవారమే విడుదలైంది. ఈ సినిమా చూసినవాళ్లెవరికైనా హిట్‌కి సీక్వెల్ ఉంటుందన్న సంగతి అర్థమైపోతుంది. ఎందుకంటే పార్ట్ 2 కూడా ఉందని చివర్లో హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. నిజానికి పార్ట్ 2 ఆలోచన ముందు నుంచీ ఉంది. హిట్‌ని ఓ ఫ్రాంజైజీగా చేయాలన్నది నాని ప్లాన్. తక్కువ బడ్జెట్‌తో పూర్తయ్యే సినిమాలివి. కనీసం అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి అమ్ముకున్నా పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేస్తుంది. సినిమా హిట్టయి, మంచి వసూళ్లు రాబట్టుకుంటే అది బోనస్ అనుకోవాలి. అందుకే హిట్ పరంపరలో కొన్ని సినిమాలు చేయాలని నాని నిర్ణయించుకున్నాడు.
దర్శకుడు, హీరోలు మారుతున్నా - హిట్ పేరుమీద సినిమాలు వస్తూనే ఉంటాయన్న మాట. అయితే హిట్ సినిమాకి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తొలి రోజు వసూళ్లు బాగానే ఉన్నా, అవి నిలకడగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఈ దశలో పార్ట్ 2 తీయడం నిజంగానే ఓ సాహసం అనుకోవాలి. అయితే స్క్రిప్టు రెడీగా ఉంది కాబట్టి, నాని పార్ట్ 2కి రంగం సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. కాకపోతే పార్ట్ 2 ఉంటుందా, ఉండదా అనేది కథానాయకుడు విశ్వక్ చేతుల్లో ఉంటుంది. తను ఒప్పుకుంటే పార్ట్ 2 ఉంటుంది, లేదంటే లేదు.