హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్.. అంటూ ‘హిట్’ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోన్న విషయం విదితమే. హీరో నాని, ఈ చిత్రానికి సమర్పకుడు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ (చి.ల.సౌ. ఫేం) ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ఓ కేసుని విచారిస్తోన్న పోలీస్ అధికారిగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ఇప్పటికే ప్రమోస్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ వచ్చాక.. ఆ అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఓ అమ్మాయి మిస్సింగ్ కేసుని డీల్ చేస్తుంటాడు హీరో. ఈ క్రమంలో అతనెదుర్కొనే సమస్యలు.. డిపార్ట్‌మెంట్ తరఫున ఎదురయ్యే ఇబ్బందులు.. ఇవన్నీ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.
ప్రీతి అనే అమ్మాయి చుట్టూ కథ నడుస్తోంది. అసలామె ఏమయ్యింది.? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్వక్ సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు ప్రోమోస్‌లో. రుహానీ శర్మ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. దర్శకుడు సైలేష్ కొలను మేకింగ్ స్టయిల్, ప్రోమోస్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. నిర్మాణపు విలువలు కూడా బాగానే కన్పిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే చాలా డిఫరెంట్‌గా వుంది కెమెరా మూమెంట్స్ అన్నీ అద్భుతం. ఇక, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే, సినిమాకి ప్రాణం పోసేలానే వున్నట్టుంది. ప్రోమోస్‌ని పెర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసిన తీరు చూస్తే, సినిమాపై ఖచ్చితమైన అంచనాలతో ఆడియన్స్ దియేటర్లకు వెళ్ళొచ్చనిపించడం ఖాయం.