యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా కోసం హాలీవుడ్ నటుడ్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. 'ఒలంపస్ హాజ్ ఫెలెస్', 'ది ఈక్వలైజర్', 'వార్ డాగ్స్ తదితర హాలీవుడ్ సినిమాలతో నటుడిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న డాన్ బిల్డరియాన్ - నితిన్ హీరోగా నటిస్తున్న 'లై' సినిమాలో కనిపించబోతున్నాడు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. 'లై' సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో సూపర్ థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడట. నితిన్ సరసన మేఘా ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అమెరికాలో జరుగుతోంది. అక్కడే నితిన్, హాలీవుడ్ నటుడు బిల్డరియాన్ కాంబినేషన్‌లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై హాలీవుడ్ తారల ఎంట్రీ ఈ మధ్యకాలంలో జోరుగానే కనిపిస్తోంది. అయితే ఓ తెలుగు సినిమాలో హాలీవుడ్ నటుడు కనిపించడం ఇదే ప్రథమం కావొచ్చు. నితిన్, ఈ సినిమాతోపాటుగా త్రివిక్రమ్ - పవన్ నిర్మిస్తున్న సినిమాలోనూ హీరోగా నటించనున్నాడు.