బిగ్ బాస్ 3కి నాగార్జున హోస్ట్ అనగానే ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో ప్రశ్నలు. ఈ షోని ఇది వరకు ఎన్టీఆర్, నాని హ్యాండిల్ చేశారు. వారిద్దరి యాంకరింగ్‌తో ఈ షో ఆద్యంతమూ రక్తి కట్టింది. నాగార్జున లాంటి సీరియర్ హీరో ఈ షోని ఎలా ముందుకు నడిపిస్తాడా? అనిపించింది. పైగా `బిగ్ బాస్ లాంటి షోలంటే నాకు ఇష్టం లేదు..` అని కామెంట్ చేసిన నాగార్జున... ఈ షోకి హోస్ట్‌గా ఎలా ఎప్పుకున్నాడా? అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కువయ్యాయి. వాటిని తట్టుకుంటూ - బిగ్ బాస్ హౌస్‌ని సమర్థంగా ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలన్న ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 షోకి శ్రీకారం చుట్టేశాడు నాగార్జున. నిజానికి ఈ షో అంటేతనకు ఏమాత్రం ఇష్టం లేదని, కానీ ఇష్టాలు అభిప్రాయాలు మారతాయని, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఈ షో ఎందుకు నచ్చిందో తెలుసుకోవాలనే తాను బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టానని ముందే క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున. కంటెస్టెంట్లని ఆహ్వానించే పద్ధతి, వాళ్లని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించిన విధానం, ఆడియన్స్‌తో ఇంట్రాక్షన్... ఇవన్నీ చూస్తే... తొలి అడుగులో నాగార్జున పాసైపోయినట్టే కనిపిస్తున్నాడు.
మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బుల్లి తెరని బాగా అర్థం చేసుకోగలిగాడు నాగ్. ఆ అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. షోని నిర్వహించే విషయంలో నాగ్ ఎక్కడా టెన్షన్ పడడం లేదు. తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ 3సీజన్‌కి కర్టెన్ రైజర్ ఓ రేంజ్‌లో సాగింది. మరి తరవాతర్వాత ఏమవుతుందో...? మున్ముందు ఈ మన్మథుడు ఇంకెన్ని మార్కులు సంపాదించుకుంటాడో చూడాలి.