మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇదే రోజు బాలీవుడ్‌లో 'వార్' చిత్రం కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలూ అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కూడా విడుదలవుతుండడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా పడాలనే కోణంలో తెర వెనక వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గురించి గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ అప్పుడెప్పుడో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. 'మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా, చాలా సింపుల్‌గా ఉంటారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో ఆయనే నాకు స్పూర్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆయన వ్యక్తిత్వం నాకు ఆదర్శం. నాకే కాదు, ఆయన వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం.. ఎన్నో సార్లు ఆయన్ని నేను కలిశాను. ఆయనలోని స్నేహభావం, ఇతరులపై చూపించే ప్రేమ అమోఘం..' అని హృతిక్ వ్యాఖ్యానించారు. త్వరలో 'సైరా'తో 'వార్'కి సిద్ధపడుతున్న నేపథ్యంలో హృతిక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
మెగాస్టార్ అంటే, టాలీవుడ్‌కే కాదు, బాలీవుడ్ స్టార్స్‌లోనూ అపారమైన అభిమానం ఉందని తెలిపేందుకు హృతిక్ వ్యాఖ్యలే నిదర్శనం. హృతిక్ రోషనే కాదు, సల్మాన్ ఖాన్, అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్.. ఇలా పలువురు బాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవిపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఆ అభిమానంతోనే 'నా సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంది. అది మీరు మాత్రమే చేయాలి..' అని చిరంజీవి ఒక్క మాట అడగ్గానే అది ఎలాంటి క్యారెక్టర్ అని ఎదురు ప్రశ్నించకుండానే వెంటనే ఓకే చేసేశారు బిగ్‌బీ అమితాబ్. దటీజ్ మెగాస్టార్ అంతే.