రజనీకాంత్ సూపర్ హిట్టు కొట్టి చాలాకాలం అయ్యింది. 2.ఓ, కలా, పేటా సినిమాలు బాగా నిరుత్సాహపరిచాయి. అయితే రజనీకొత్త సినిమా `దర్బార్`పై మంచి ఆశలే ఉన్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. `స్పైడర్` తప్ప.. మురుగదాస్ లెక్కలు ఎప్పుడూ తప్పు కాలేదు. పైగా రజనీ - మురుగదాస్ కాంబో అంటే - ఆ హైపే వేరు. కానీ ఈసినిమాకి కేటాయించిన బడ్జెట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏకంగా 250 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార్ట. కేవలం రజనీ - మురుగదాస్ కాంబోని నమ్ముకుని ఈ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నార్ట.
ఎంత రజనీ సినిమా అయితే మాత్రం, ఇంత రిస్కా? అనేది తమిళ జనాల మాట. రజనీకాంత్ సినిమా ఇప్పటి వరకూ 200 కోట్లను మించి వసూళ్లను అందుకోలేదు. పైగా రజనీ కాంత్ కి వరుస ఫ్లాపులు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో 250 కోట్లని తిరిగి రాబట్టుకోవడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా లైకా సంస్థకు ఇటీవల భారీ షాకులు తగిలాయి. అటూ ఇటూ అయితే.. లైకా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగులో సంక్రాంతికి పోటీ గట్టిగా ఉంది. మహేష్, బన్నీ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఎంత కాదన్నా... రజనీ సినిమాకి గట్టి పోటీ తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే మాత్రం 250 కోట్లు రికవరీ చేయడం కష్టమే.