పారితోషికం ముందు... పాత్ర తీరుతెన్నులు తరవాత... - ఇదీ.. నేటి కథానాయికల సూత్రం. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని గట్టిగా ఫిక్సయిపోయారు. అందుకే... పారితోషికం నచ్చితే ఎలాంటి సినిమానైనా ఒప్పేసుకుంటున్నారు. నిధి అగర్వాల్ కూడా అదే చేసింది. ఇస్మార్ట్ శంకర్‌తో ఓ సూపర్ హిట్టు కొట్టింది నిధి. ఇప్పుడిప్పుడే పెద్ద హీరోల దృష్టిలో పడుతోంది. అలాంటిది పోయి.. పోయి ఓ కొత్త హీరో సినిమా ఒప్పుకుంది. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అరగ్వాల్‌ని ఎంచుకున్నారు.
ఈ సినిమా కోసం నిధికి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశార్ట. అందుకే నిధి మరో మాట మాట్లాడకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. నిజానికి ముందు కథ చెప్పడానికి వెళ్తే... `నా దగ్గర డేట్లు లేవు` అని ఖరాఖండీగా చెప్పేసిందట. తీరా పారితోషికం ఇంత ఇస్తామని చెప్పేసరికి - మారు మాట్లాడకుండా సినిమా ఒప్పుకుందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ కోసం నిధికి ఇచ్చిన పారితోషికంతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ఇంత మార్పు.. ఒక్క సినిమాతో అంటే.. మాటలా??