జనసేన కోసం పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అయ్యారు. అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశారు. తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపైనే పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్ కూడా రాబోతోంది. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకూ రాజకీయంగా స్థబ్దత వచ్చే అవకాశం ఉంది. ఈలోగా పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయబోతున్నారని, పవన్ కోసం కొన్ని కథలు తయారవుతున్నాయని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే పవన్ చేతిలో ఇంకా రెండు మూడు సంస్థల అడ్వాన్సులు ఉన్నాయి. వాళ్ల కోసమైనా సినిమాలు పూర్తి చేయాలి. అందులో మైత్రీ మూవీస్ ఒకటి. ఎన్నికల ముందు మైత్రీ మూవీస్‌తో పవన్ ఓ సినిమా చేస్తారని ప్రచారం సాగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. మైత్రీకి ఓ దశలో పవన్ అడ్వాన్సు వెనక్కి పంపాడు. కానీ మైత్రీ తీసుకోలేదు. `మనం ఎప్పటికైనా సినిమా చేద్దాం..` అంటూ ఆ మైత్రీ బంధాన్ని కొనసాగించింది.
ఇప్పుడు మైత్రీ మూవీస్ ముందుకొచ్చి.. పవన్‌తో సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పవన్‌కి సరిపడా ఓ కథ మైత్రీ దగ్గర ఉంది. ఆ సినిమాలో నటిస్తే పవన్‌కి రూ.30 కోట్ల పారితోషికం ఇస్తామని అంటోందట. అజ్ఞాతవాసి కోసం పవన్ తీసుకున్నది పాతిక కోట్లు. ఇప్పుడు మరో 5 కోట్లు అదనంగా వస్తాయన్నమాట. అయితే పవన్ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని సమాచారం. పవన్ కి సినిమాలు చేసే ఉద్దేశం ఉన్నా, లేకపోయినా.. ఇలాంటి బంపర్ ఆఫర్లకు మాత్రం కొదవ లేకుండా పోతోంది. మరి పవన్ మనసు ఎప్పటికి మారుతుందో చూడాలి.