ఇద్ద‌రి లోకం ఒక‌టే మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్ తదితరులు 
దర్శకత్వం :  జి ఆర్ కృష్ణ 
నిర్మాత‌లు : దిల్ రాజు 
సంగీతం : మిక్కీ జె మేయర్ 
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి 

 

రేటింగ్‌: 2.5/5

 

విజ‌యం అత్య‌వ‌స‌ర‌మైన క‌థానాయ‌కుల్లో రాజ్‌త‌రుణ్ ఒక‌రు. గ‌త సినిమాలు ఆయ‌నకి చేదు ఫ‌లితాల్నిచ్చాయి. దాంతో  క‌మ్‌బ్యాక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు.  త‌న వ‌య‌సుకు త‌గ్గట్టుగా మ‌రోసారి  ప్రేమ‌క‌థ‌ని ఎంచుకుని `ఇద్ద‌రిలోకం ఒక‌టే` చేశాడు. మ‌రి ఆయ‌నకి ఈ చిత్రం విజ‌యాన్నిచ్చిన‌ట్టేనా?  సినిమా ఎలా ఉంది?    ఈ విష‌యాలు తెలుసుకునేముందు క‌థ‌లోకి వెళ‌దాం...

 

*క‌థ

 

మ‌హి (రాజ్‌త‌రుణ్‌), వ‌ర్ష (షాలినిపాండే) గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే  ఒక‌రికోసం మ‌రొక‌రు సాయం చేసుకుంటారు. ఇద్ద‌రూ ఒకేరోజు పుట్టి, ఆ త‌ర్వాత స్నేహితులవుతారు.  అంత‌లోనే విడిపోతారు. 18 యేళ్ల త‌ర్వాత అనుకోకుండా క‌లుసుకుంటారు. చిన్న‌ప్ప‌టి ఒక జ్ఞాప‌కం ఇద్ద‌రినీ క‌లుపుతుంది. త‌క్కువ కాలంలోనే మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.  హీరోయిన్ కావాల‌ని క‌ల‌లు కంటూ, ప్ర‌య‌త్నాల‌తో విసిగిపోయిన వ‌ర్ష కోసం ఫొటోగ్రాఫ‌ర్ అయిన మ‌హి ఒక సాయం చేస్తాడు. దాంతో వ‌ర్ష హీరోయిన్ అవుతుంది.  క్ర‌మంగా ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు.  ఇంత‌లో మ‌హి జీవితం చిక్కుల్లో ప‌డుతుంది. ఇంత‌కీ మ‌హికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమిటి?  దానికోసం వ‌ర్ష ఏం చేసింది?  వీళ్లిద్ద‌రి ప్రేమ ప్ర‌యాణం ఎక్క‌డిదాకా చేరింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

 

*విశ్లేష‌ణ‌

 

తెరపై క‌థ చెప్పే విధానంలో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు వ‌స్తూనే ఉంటాయి. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా క‌థల్ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంపై ద‌ర్శ‌కులు దృష్టిపెడుతుంటారు. క‌థ‌లు మాత్రం ఎప్పుడైనా ఒకలాగే ఉంటాయి. పాత క‌థ‌ల్ని, అంతే పాత‌గా చెప్పిన‌ప్పుడే స‌మ‌స్య‌లొస్తాయి. ఈ సినిమా విష‌యంలో అదే జ‌రిగింది. 90వ ద‌శ‌కంలో ప్రేమ‌క‌థ‌ల్ని ఎలా తీసేవారో, అలాగే ఈ ప్రేమ‌క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌నంలో ఆస‌క్తి లేదు, స‌న్నివేశాల్లో వేగం లేదు, ఫీల్ పండ‌దు, హాస్యం కోసం మ‌చ్చుకైనా ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దాంతో ప్రేక్ష‌కుల‌పై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌కుండా థియేట‌ర్ నుంచి బ‌య‌టికి పంపిస్తుందీ చిత్రం.  అతి సాధార‌ణ ప్రేమ‌క‌థ‌గా మిగిలిపోయింది.

 

నిజానికి మంచి ఫీల్‌తోపాటు,  ఎమోష‌న్స్‌ని పండించేంత బ‌లం ఉన్న క‌థ ఇది.  ప్రేమ‌, త్యాగం, విషాదం, బాల్యం స్మృతులు... ఇలా ఎన్నో అంశాలు ఈ క‌థ‌లో ఉన్నాయి.  స‌రైన క‌థ‌నం లేక‌పోవ‌డంతో అవ‌న్నీ వృథా అయిపోయాయి.  ఈ క‌థ‌ని ప‌ట్టాలెక్కించ‌డానికే ద‌ర్శ‌కుడు బోలెడంత స‌మ‌యం తీసుకున్నాడు. నాయ‌కానాయిక‌ల ప‌రిచ‌యాల త‌ర్వాత కానీ అస‌లు క‌థ మొదల‌వ్వ‌దు. ఆ త‌ర్వాత సినిమా ఎంత‌కీ ముందుకు సాగ‌దు. వ‌ర్ష  హీరోయిన్‌గా చేసే ప్ర‌య‌త్నాలు,  మ‌హి ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేయ‌డం, అత‌ని ఫొటోల ప్ర‌తిభ వ‌ల్ల వ‌ర్ష‌కి హీరోయిన్‌గా అవ‌కాశం రావ‌డమే తొలి స‌గ‌భాగం క‌థ‌. విరామం స‌మ‌యంలో హీరోకి స‌మ‌స్య ఏర్ప‌డం ఒకింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద్వితీయార్థంలోనైనా క‌థ‌పై ప‌ట్టు దొరికిందేమో అనుకుంటే, మ‌ళ్లీ అక్క‌డ మామూలే.  ప్ర‌థ‌మార్థం త‌ర‌హాలోనే బాల్య‌స్మృతుల‌తోనే  సినిమా సాగుతుంది. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం కొద్దిలో కొద్దిగా ఆక‌ట్టుకునేలా ఉంటాయి.  ప్రేమ‌జంట మ‌ధ్య కెమిస్ట్రీ, అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు మిన‌హా ఈ క‌థ‌లో కానీ, క‌థ‌నంలో కానీ ఏమాత్రం కొత్త‌ద‌నం క‌నిపించ‌దు.

 

*న‌టీన‌టులు


షాలినిపాండే త‌న అందంతోనూ, అభిన‌యంతోనూ ఆక‌ట్టుకుంది. ఆమే సినిమాకి ఆక‌ర్ష‌ణ‌. మంచి భావోద్వేగాలు కూడా పండించింది. రాజ్‌త‌రుణ్ ప‌ర్వాలేద‌నిపించాడు. ఆయ‌న‌కి ఇది కొత్త పాత్ర‌. ఎప్పుడూ హుషారుగా తెర‌పై క‌నిపిస్తుంటాడు. కానీ ఇందులో మాత్రం అండ‌ర్ ప్లే చేశాడు. ఆ పాత్ర అలాంటిది. రోహిణి క‌థానాయిక త‌ల్లిగా ఆక‌ట్టుకుంటుంది. నాజ‌ర్‌, పృథ్వీ,  సిజ్జు త‌దిత‌రుల పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. రాజా సిరివెన్నెల కూడా నామ‌మాత్ర‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాడంతే. ఇక  మిగిలిన పాత్ర‌ల ప‌రిధి త‌క్కువ‌.

 

*సాంకేతిక‌త‌


సాంకేతికంగా సినిమా ఆక‌ట్టుకుంటుంది. స‌మీర్‌రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం, మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. పాట‌లు, వాటి చిత్రణ ఆక‌ట్టుకుంటుంది. అబ్బూరి ర‌వి మాట‌లు అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. ట‌ర్కిష్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
 

*ప్ల‌స్ పాయింట్స్‌

సంగీతం
ఫోటోగ్రఫీ
 

*మైన‌స్ పాయింట్స్‌

కథ
కథనం
 

*ఫైన‌ల్ వర్డిక్ట్‌: ఇదొక పాత ప్రేమ‌లోకం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS