నటీనటులు : శ్రీసింహా, వెన్నెల కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం : రితేష్ రానా
నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ), హేమలత
సంగీతం : కాలభైరవ
సినిమాటోగ్రఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రేటింగ్: 2.5/5
మత్తువదలరా సినిమా మూడు విధాల ప్రేక్షకుల దృష్టిని, చిత్రసీమ దృష్టినీ ఆకర్షించింది. ఒకటి.. ఇందులో కీరవాణి తనయుడు హీరోగా నటిస్తున్నాడు. రెండోది.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా కీరవాణి తనయుడే. మూడోది... స్టార్ హీరోలతో సినిమాల్ని తెరకెక్కించిన మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అలా మూడు విధాలుగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. మరి.. ఆ స్థాయిలో ఈ సినిమా వినోదపరిచిందా? ప‌్రేక్షకుల్ని మత్తులో మంచెత్తిందా? చిత్తు చేసిందా?
*కథ
బాబూ మోహన్ (శ్రీసింహా) కొరియర్ బాయ్‌గా పనిచేస్తుంటాడు. జీతం పది హేను వేలు. కటింగులు పోనూ నాలుగువేలే చేతికి వస్తాయి. అది కూడా జీతం అందుకున్న తొలిరోజే ఐపోతాయి. దాంతో ఉద్యోగం మీద, జీవితం మీద విరక్తి వస్తుంది. ఉద్యోగానికి రాం.. రాం చెప్పేద్దామనుకుంటాడు. కానీ... అదే కొరియర్ ఆఫీసులో పనిచేస్తున్న స్నేహితుడు, రూమ్మేట్ యేసు (సత్య) మాత్రం ఇదే ఉద్యోగం చేస్తూ లక్షలు లక్షలు సంపాదించొచ్చు.. అంటూ ఓ కిటుకు చెబుతాడు. తస్కరించే విద్య నేర్పుతాడు.
కాస్త నేర్పరితనం ఉపయోగించి, కష్టమర్ల దగ్గర డబ్బులు ఎలా దోచుకోవొచ్చో గీతోపదేశం చేస్తాడు. దాంతో.. ఎలాగో ధైర్యం చేసి, ఓ వృద్ధురాలు (పావలా శ్యామల) దగ్గర తొలిసారి చోర విద్య ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా.. తన ప్రయత్నం బెడసికొడుతుంది. ఆ వృద్ధురాలు చనిపోతుంది. ఆ కేసు తనమీద పడుతుందన్న భయంతో.. కొన్ని అనుకోని తప్పులు చేస్తాడు. దాంతో.. ఓ పెద్ద కేసులో చిక్కుకోవాల్సివస్తుంది. ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు? రూ.500 కోసం చేసిన చిన్న తప్పు... తన జీవితాన్ని, స్నేహితుల జీవితాలనూ ఎలా ముప్పులో నెట్టేసింది? అనేదే కథ.
*విశ్లేషణ
కథగా చెబుతున్నప్పుడు `మత్తువదలరా` చాలా థ్రిల్లింగ్‌గానే అనిపిస్తుంది. రూ.500 నోటు కోసం కక్కుర్తి పడితే.. జీవితం ఎన్ని విధాలా ఇరుకున పడిపోయిందో చాలా ఆసక్తిగా చూపించే స్కోపు దొరికింది. దాన్ని... దర్శకుడు చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు. కొరియర్ బోయ్‌లు చేసే మోసాన్ని... సత్య పాత్రతో కళ్లకు కట్టాడు. అలానే డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసిన కథానాయకుడు మాత్రం అనూహ్య పరిస్థితుల్లో ఇరుక్కుపోతాడు. ఆ దృశ్యాల్ని దర్శకుడు చాలా బాగా చూపించాడు. కథలో ప్రేక్షకుడ్ని తీసుకెళ్లిన విధానం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పావలా శ్యామల చనిపోయిన తరవాత.. కథానాయకుడు ఉచ్చులో బిగుసుకుపోయే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అక్కడే యేసు, అభి పాత్రల్ని కథానాయకుడు ఊహించుకోవడం, వాళ్లు సలహాలు ఇస్తున్నట్టు భావించి, దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం చాలా మంచి ఐడియా. అక్కడ సత్య పాత్రతో వినోదం పండించడానికి స్కోప్ దొరికింది. విశ్రాంతి వరకూ సత్య అందించే వినోదం, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సినిమాని చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు.
అసలు ఆ ఫ్లాటులో ఏం జరిగింది..? ఎవరు మర్డర్ అయ్యారు? చేసింది ఎవరు? కథానాయకుడు బ్యాగులోకి 50 లక్షలు ఎలా వచ్చాయి? అనేవన్నీ చక్కని చిక్కుముడులే. వాటిని దర్శకుడు ఎలా విప్పుతాడా? అనే ఉత్సుకత రేగింది. అయితే ముడివేసినప్పుడు ఉన్న నేర్పు తీసేటప్పుడు కూడా ఉండాలి. దురదృష్టవశాత్తూ అదే జరగలేదు. ద్వితీయార్థం నుంచీ సినిమా గ్రాఫు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. తొలి భాగంలో ఉన్న వినోదం కూడా మిస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో సత్య కామెడీ చేయాలని చూసినా ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. కథలో అవనసరమైన మలుపులు వస్తాయి. కొందరిని కావాలని విలన్లుగా మార్చేశారు. దాంతో కథనం కంగాళీ అయ్యింది. ఏదో ఊహించుకుంటే మరేదో జరిగింది. డ్రగ్స్ మాఫియా, దానికి సంబంధించిన లాజిక్కులు బలవంతంగా అతికించినట్టు తయారయ్యాయి. దాంతో తొలి భాగంలో ఉన్న నేర్పు ద్వితీయార్థంలో కనిపించలేదు.
*నటీనటులు
సత్య తప్ప అంతా కొత్తవాళ్లే. సత్య తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఈసినిమాకి ఉన్న అతి పెద్ద రిలీఫ్ సత్యనే. తన మార్క్ ఫన్ బాగా పండింది. కీరవాణి తనయుడు శ్రీసింహకు ఇదే తొలి చిత్రం. తను చాలా సహజంగా నటించాడు. నరేష్ అగస్త్య నటన కూడా బాగుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ పాత్రలూ ఆకట్టుకుంటాయి. మిగిలిన వాళ్ల పాత్రలకున్న స్కోప్ చాలా తక్కువ.
*సాంకేతికత
కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ నేపథ్య సంగీతం అందించిన తొలి చిత్రమిది. పాటలు లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ఓ థీమ్ ప్రకారం సంగీతం సాగింది. ఫొటోగ్రఫీ నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగుంది. దాన్ని తొలి సగం వరకూ సమర్థవంతంగా తీశాడు. సెకండాఫ్‌లోనే కన్‌ఫ్యూజ్‌కి గురయ్యాడు. అక్కడక్కడ వినోదం, థ్రిల్ ఇవ్వడంతో.. కొన్ని సన్నివేశాలు పండాయి.
*ప్లస్ పాయింట్స్
ఫస్టాఫ్
కథాంశం
సత్య
నేపథ్య సంగీతం
*మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
ఇరికించిన మలుపులు
*ఫైనల్ వర్డిక్ట్: మత్తు సగమే వదిలింది