చిత్రసీమలో బయోపిక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇళయరాజా బయోపిక్ కి క్లాప్ కొట్టారు. ఇళయరాజా పాత్రలో ధనుష్ కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ బయోపిక్‌ని రూపొందిస్తున్నారు. ఇళయరాజాకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధనుష్ కూడా పాన్ ఇండియా స్టారే. కాబట్టి.. ఈ సినిమా ఆటోమెటిగ్గా పాన్ ఇండియా సినిమా అయిపోయింది.
ఇళయరాజా పక్కా కమర్షియల్. తన పాటలు మరే ఇతర మీడియాలో వచ్చినా, బహిరంగంగా వేదికలపై పాడినా తనకు రాయల్టీ వచ్చేలా ఓ సిస్టమ్ ఏర్పాటు చేసుకొన్నారు. బయోపిక్‌కి గానూ.. ఆయన భారీ మొత్తంలో రాయల్టీ తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఇళయరాజా సినిమాకు గానూ వచ్చిన లాభాల్లో 30 శాతం ఆయనకు రాయల్టీ రూపంలో చెల్లించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాకు 30 కోట్లు లాభం వస్తే.. 9 కోట్లు ఇళయరాజా ఖాతాలో జమ చేయాలన్నమాట. ఓ రకంగా... ఇది పెద్ద మొత్తమే. ఓ బయోపిక్ కు గానూ.. రాయల్టీ రూపంలో ఎక్కువ మొత్తం అందుకొంటున్న కళాకారుడిగా ఇళయరాజా చరిత్ర సృష్టించినట్టే.
ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడికావాల్సివుంది. సంగీత దర్శకత్వ బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ అందుకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల దేవిశ్రీ ఇళయరాజాని కలుసుకొన్నారు. దాంతో... ఈ సినిమా దేవి చేతుల్లోకి వెళ్లినట్టే అనిపిస్తోంది.