మాస్ట్రో ఇళయరాజా... త్వరలో రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్నారా? ఆయనకు నామినేటెడ్ పదవి దక్కబోతోందా? అవుననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ఆయన్ని రాజ్యసభకు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆయన మోడీని కీర్తిస్తూ... భారీ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మెడీని అంబేడ్కర్‌తో పోలుస్తూ కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. అంబేడ్కర్ బతికి ఉంటే, మోడీ పాలన చూసి సంతోషపడేవారని వ్యాఖ్యానించారు.
బేటీ బచావో, మేకిన్ ఇండియా కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, రోడ్లు, హైవేలు.. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఉన్నాయని ఆయన కీర్తించారు. ఇళయరాజా కామెంట్లపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. సంగీతంలో ఇంత గొప్ప మేధావి అయ్యుండి, మోడీకి భజన చేయాల్సిన అవసరం ఏముందని అంతా విమర్శించారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వాన్నీ, మోడీనీ ప్రసన్నం చేసుకోవడానికే అన్నది కొందరి వాదన.
అయితే ఈ వ్యాఖ్యలకు తగిన ప్రతిఫలం ఇళయరాజాకి దక్కబోతోందని, ఆయన్ని బీజేపీప్రభుత్వం త్వరలోనే రాజ్యసభకు పంపబోతోందనిప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే ఇళయరాజా కూడా ఇలాంటి కామెంట్లు చేశారని చెప్పుకుంటున్నారు. నిజానికి కళకారుల్ని గౌరవ సభ్యులుగా ఎంపిక చేసి, రాజ్యసభకు పంపండం చాలా కామన్. ఇళయరాజా అందుకు అర్హుడు కూడా. ఆయన బీజేపీకి భజన చేయడం వల్లే.. రాజ్యసభ పదవి వచ్చిందనుకోవడం ఆయన్ని అవమానించినట్టే అవుతుందని ఇళయరాజా అభిమానులు చెబుతున్నారు.