బాలీవుడ్ లో మరోసారి దక్షిణాది సినిమా జెండా ఎగరేసింది. బాహుబలి, కేజీఎఫ్ 1, పుష్ప చిత్రాలతో మన సినిమా సత్తా హిందీ ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు మరోసారి కేజీఎఫ్ చాప్టర్ 2తో... దక్షిణాది సినిమాకి తిరుగులేదన్న సంకేతాలు అందేశాయి.
భారీ అంచనాలతో విడుదలైన చాప్టర్ 2 సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నార్త్ లో 54 కోట్లు సాధించిన ఈ చిత్రం... రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించి 47 కోట్లు సాధించింది. అంటే రెండు రోజులకు 100 కోట్లకు పై మాటే అన్నమాట. ఇది నార్త్ లో సరికొత్త రికార్డ్. బాహుబలి 2, దంగల్‌కి కూడా సాధ్యం కాని మార్క్ ఇది. కేవలం రెండు రోజుల్లో వంద కోట్లు సాధించిన చిత్రంగా.. కేజీఎఫ్ 2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్ 1 సైతం.. మంచి విజయాన్ని అందుకున్నా.. ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. బాలీవుడ్‌లో కేజీఎఫ్ 1 టోటల్ రన్ లో 200 కోట్లు సాధించింది.
అయితే.. కేజీఎఫ్ 2 కేవలం నాలుగైదు రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగొందల కోట్లు వసూలు చేసే అవకాశం ఉందన్నది ఓ అంచనా. ఆదివారం కూడా కేజీఎఫ్ జోరు కొనసాగితే... ఈ రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేం కాదు.