ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' సినిమా. మామూలుగా అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే వుండాలి. విజయ్ దేవరకొండకి ఇటీవల పెరిగిన స్టార్‌డమ్ అందుకు కారణం.
కానీ, 'నోటా' సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్, దాంతోపాటుగా 'ట్యాక్సీవాలా' సినిమా విడుదలకు ముందే లీక్ అవడంతో విజయ్ స్టార్‌డమ్ కూడా కొంత తగ్గింది. ఒక్క సినిమాకే స్టార్‌డమ్ ఇంతలా పతనమైపోతుందా? అని మొత్తంగా సినీ పరిశ్రమ ఆశ్చర్యపోతోంది. ఇప్పటికే లీక్ అయిపోయిన సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు విజయ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
విజయ్ దేవరకొండ, చాలా కష్టపడి పైకొచ్చాడంటూ అల్లు అర్జున్ కితాబులిచ్చాడు. తామెంతో కష్టపడి చేసిన సినిమా కొందరి దుశ్చర్య కారణంగా ముందే లీక్ అయినా, ఫైనల్ వెర్షన్ ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నాడు విజయ్ దేవరకొండ. సోషల్ మీడియా వేదికగా ఓ వైపు సినిమా కష్టాల గురించి చెబుతూ, ఇంకో వైపు సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన విజయ్, ఎలాగైనా 'ట్యాక్సీవాలా' సినిమాతో బౌన్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రియాంకా జవాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెల్సిందే. ఎంతలా విజయ్ ఈ సినిమాని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నా, ఆ స్థాయిలో సినిమాకి హైప్ రావడంలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుంటే, విజయ్‌కి పోటీగా ఒక రోజు ముందు రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది విజయ్‌కి అంత పాజిటివ్ నోడ్ కానే కాదు. ఈ పరిస్థితుల్లో 'ట్యాక్సీవాలా' గట్టెక్కడం అంత సులువేమీ కాదని అంతటా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అద్భుతం జరగాలి.. జరుగుతుందా మరి 'ట్యాక్సీవాలా' విషయంలో!