రాజమౌళి ఏం చేసినా.. అందులో ఏదో సమ్ థింగ్ స్పెషల్ ఉంటుంది. సినిమాకి సంబంధించిన విషయమైతే ఆయన బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. ఎప్పుడూ సినిమా గురించి తప్ప మరో ఆలోచన లేని రాజమౌళి... సినిమాకీ, ఇంటికీ మధ్య గీతని చెరిపేసే దిశగా మరో అడుగు వేశారు. సెట్‌లోనే తనకంటూ ఓ ఇల్లు కట్టుకుని... కొత్త సంప్రదాయానికి తెర లేపారు.
ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్`ని పట్టాలెక్కిస్తున్న రాజమౌళి.. ఈసినిమా కోసం ఓ కొత్త ఆలోచన చేశారు. అదేమిటంటే... షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే తాత్కాలికంగా ఓ ఇల్లు కట్టేశారు. `ఆర్.ఆర్.ఆర్` కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈసెట్లోనే దాదాపు 50 శాతం షూటింగ్ జరగబోతోంది. నగర శివార్లలో ఉన్న షూటింగ్ లొకేషన్ ఇది.
ప్రతీరోజూ ఇంటినుంచి లొకేషన్‌కి వెళ్లాలంటే.. చాలా సమయం పడుతుంది. అందుకే.. సెట్లోనే ఇల్లు డిజైన్ చేసుకున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే మండువా ఇల్లు కట్టించారు. ఇక నుంచి షూటింగ్ అయిపోయేంత వరకూ రాజమౌళి ఆ ఇంట్లోనే ఉంటారన్నమాట. తన ఇంట్లోనే ఎడిటింగ్ కోసం ఓ ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసుకున్నారు రాజమౌళి.
అంతేకాదు... ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, సింథిల్ కోసం కూడా ప్రత్యేకమైన గదులు నిర్మించార్ట. ఇక నుంచి రాజమౌళికి సెట్టే ఇల్లు... ఇల్లే సెట్టు అన్నమాట.