తెలుగు దర్శకులలో సాహితీ అభిమానులు ఎక్కువ. తెలుగు సాహిత్యం ఔపోశన పట్టినవాళ్లు కొంతమంది కనిపిస్తారు. అలాంటి వాళ్లలో క్రిష్, ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రధమ వరుసలో ఉంటారు. `కొండ పొలం`(సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి) అనే నవలని క్రిష్ సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఇంద్రగంటి కూడా నడుస్తున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన `శప్తభూమి`(బండి నారాయణ స్వామి) నవలని ఇంద్రగంటి ఓ సినిమాగా తీయబోతున్నారు.
ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. శప్తభూమి నవల తనకు బాగా నచ్చిందని, అందుకే హక్కుల్ని తీసుకున్నానని, వెబ్ సిరీస్‌గానైనా, సినిమాగానైనా దాన్ని రూపొందిస్తానని అంటున్నారు ఇంద్రగంటి. ఆయన దర్శకత్వం వహించిన `వి` ఈనెల 5న విడుదల కాబోతోంది. నాని, సుధీర్‌బాబు కథానాయకులుగా నటించారు. ఆ తరవాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడు. అది పూర్తయ్యాకే `శప్తభూమి` సెట్స్‌పైకి వెళ్తుంది.