'బండెనక బండి కట్టీ.. పదహారు బళ్లు కట్టి.. పట్నం పోదం కొడకో..' అనే పాట చాలా ఫేమస్ అప్పట్లో. అయితే అప్పటి సందర్భం వేరు. ఇప్పటి సందర్భం వేరు. కానీ బళ్లు మాత్రం పట్నం వైపు పోటెత్తుతున్నాయి. ఏ పట్నం అనుకుంటున్నారా.? తెలంగాణా పట్నం వైపు. ఆంధ్ర, తెలంగాణా బోర్డర్ ఏరియాస్‌లో ఈ సందడి కనిపిస్తోంది. అరె ఇప్పుడేం సంక్రాంతి, దసరా వంటి పండగలు లేవు కదా. ఏంటీ విపరీత ధోరణి అనుకుంటున్నారా.? అయితే మీకీ విషయం తెలియాల్సిందే. లేటెస్ట్‌గా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణాలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా విడుదల కాలేదు. కోర్టు స్టేలు.. అవీ ఇవీ అంటూ అడ్డంకులు ఏర్పడడంతో ఆక్కడ ఈ సినిమా విడుదలను ఆపేసిన సంగతి తెలిసిందే. అందుకే ఆంధ్ర, తెలంగాణా బోర్డర్స్‌కి, కొన్ని కిలోమీటర్లు దూరంలో ఉన్న వారు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చూసేందుకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటి, తెలంగాణా బోర్డర్‌లోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రాలుగా ఆంధ్రా, తెలంగాణా విడిపోయినా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఈ రెండు బోర్డర్‌లను కలిపేస్తుండడం విశేషం. ఏకంగా ఫ్లైట్స్‌లో వచ్చి మరీ ఈ సినిమా చూసేసి వెళ్తున్నారట. ఆ ఫ్లైట్ టికెట్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు కొంతమంది.
రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాపై క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ అలాంటిది. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ సినిమాలు చూసేందుకు జనం ఇలాగే ఊళ్లు ఊళ్లు దాటి వెళ్లేవారు. మళ్లీ ఇన్నాళ్లకి ఆయన బయోపిక్‌గా తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా చూసేందుకు అదే సాంప్రదాయం రిపీట్ కావడం ఆశ్చర్యకరం. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయన కొడుకు బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎన్టీఆర్ - కథానాయకుడు, మహానాయకుడు' సినిమాలకు ఈ స్థాయిలో ఆదరణ దక్కకపోవడం విచారకరం.