ప్రతీ వారం ఓ కొత్త సినిమా రాకపోతే, దాని గురించి మాట్లాడుకోకపోతే... ఏదో వెలితిగానే ఉంటుంది. వారాంతంలో కొత్త సినిమా చూడడం తెలుగువాళ్లకూ ఓ అలవాటుగా మారుతోంది. సినిమా బాగున్నా, లేకున్నా - వారం అంతా దాని గురించే మాట్లాడుకోవడం రివాజు అయిపోయింది. ఈవారం కూడా రెండు కొత్త సినిమాలొచ్చాయి. అవే... ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ కె.కె. మరి ఈ సినిమాల గురించి జనం ఏమనుకుంటున్నారు? విశ్లేషకులు ఎలాంటి తీర్పు ఇచ్చారు? పూరి - రామ్ కాంబోలో వచ్చిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'.
ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. అయితే పూరి ఫామ్‌లో లేకపోవడం వల్ల... ఈ సినిమాపై ఎక్కడో ఓ చోట అనుమానమూ ఉండేది. ఆ అనుమానాలు, భయాలు పటాపంచలైపోయాయి. ఎన్నాళ్ల తరవాతో... ఓ మంచి హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ మాస్‌కి నచ్చేయడంతో ఈ సినిమాని హిట్ జాబితాలో చేర్చేశారు. రామ్ ఎనర్జిటిక్ నటన, హీరోయిన్ల గ్లామర్. డబుల్ సిమ్ కార్డ్ కాన్సెప్టు, పూరి మార్క్ హీరోయిజం, డైలాగులు... మాస్‌కి బాగా నచ్చేశాయి. పైగా మాస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యిందేమో... థియేటర్లో మాస్ పూనకంతో ఊగిపోతోంది. తొలి మూడు రోజుల్లో దాదాపు 35 కోట్ల గ్రాస్ సంపాదించింది. పంపిణీదారుల పెట్టుబడి తొలి మూడు రోజుల్లోనే వచ్చేసింది.
ఆదివారం నుంచి వచ్చిన ప్రతీ రూపాయి లాభమే అన్నమాట. పూరి ఫామ్ లో లేకపోవడంతో, ఇస్మార్ట్ శంకర్ సినిమాని తక్కువ రేటుకే అమ్ముకోవాల్సివచ్చింది. ఈవారమే విడుదలైన మరో సినిమా 'మిస్టర్ కె.కె'. విక్రమ్ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రమిది. విక్రమ్‌కి ఎన్నో ఏళ్లుగా హిట్టు లేదు. కమల్ హాసన్ నిర్మాతగా మారి విక్రమ్ తో సినిమాచేయడం.. కాస్త ఆసక్తిని కలిగించింది. కనీసం కమల్ అయినా విక్రమ్‌కి హిట్ ఇస్తాడేమో అనుకున్నారు. అయితే ఈసారీ నిరాశే ఎదురైంది.
పేలవమైన కథ, కథనాలు, ఏమాత్రం థ్రిల్లింగ్‌గా లేని ఎలిమెంట్స్‌తో మిస్టర్ కె.కె విసిగించాడు. పైగా ఇస్మార్ట్ శంకర్ హవాలో కె.కె కనిపించకుండా పోయాడు. ఓపెనింగ్స్ కూడా ఏమాత్రం బాగాలేవు. విక్రమ్ కి ఇది మరో డిజాస్టర్ ఈ వారం విడుదల కావాల్సిన `ఆమె` కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మ `లయన్ కింగ్`కి తెలుగునాట ఊహించని విధంగా వసూళ్లు దక్కుతున్నాయి. పిల్లల్ని టార్గెట్ చేసిన సినిమా కావడంతో... థియేటర్లన్నీ వాళ్లతో కళకళలాడుతున్నాయి. వచ్చేవారం విజయ్ `డియర్ కామ్రేడ్` విడుదల అవుతోంది. ఆ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.