వర్మ ఏం చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది. కావల్సినంత వినోదం, దాన్ని అంటిపెట్టుకుని వివాదమూ కనిపిస్తాయి. వర్మ ఎవరినైనా టార్గెట్ చేయగలడు... బకరాలుగా మార్చగలడు. కాకపోతే ఈసారి.. పోయి పోయి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులతో పెట్టుకున్నాడు వర్మ. వాళ్లని కెలికి... తానూ చిక్కుల్లో పడ్డాడు. పూరి సినిమా `ఇస్మార్ట్ శంకర్` చూడ్డానికి బైకుపై వెళ్లాడు వర్మ.
బైకుపై వెళ్తే మజా ఏం ఉంటుంది..?? అదే బైకుపై మరో ఇద్దరిని (అగస్త్య, అజయ్ భూపతి)లను ఎక్కించుకుని మరీ వెళ్లాడు. అక్కడితో ఆగలేదు. `మేం ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించాం. పోలీసులు ఏం చేస్తున్నారు` అంటూ బైక్ తో వెళ్తున్నప్పుడు తీసిన ఫొటో ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్త విపరీతంగా ట్రోల్ అయ్యింది. దాంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు బైక్ యజమానిపై, నడుపుతున్నవాళ్లపై కేసులు నమోదు చేశారు.
1300 చలానా కూడా విధించారు. అయితే పోలీసులు అక్కడితో ఆగడం లేదు. ఇలా తమని కించపరిచేలా పోస్ట్ చేసిందుకు వర్మపై కూడా యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇలా పోలీసుల్ని అవమానిస్తూ, ట్వీట్ చేయడం ఏం బాగోలేదని పోలీస్ అధికారులు భావిస్తున్నార్ట. అందుకే వర్మపై వాళ్లంతా సీరియస్‌గా ఉన్నారని, ఈ ఎఫెక్ట్ వర్మపై అతి త్వరలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వర్మ దీన్ని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.