బాగా గమనిస్తే మన తెలుగు ఇండస్ట్రీలో హిట్ అయిన ఫార్ములానే ఎక్కువగా పాటిస్తుంటారు. అందులో భాగంగానే హారర్ కామెడీ చిత్రాలు మన దగ్గర చాలానే వచ్చాయి.
అదే కోవలో ఈ వారం వచ్చిన చిత్రం- ఆనందో బ్రహ్మ. అయితే అదే కోవకు చెందినా, కథ-కథనం అలాగే కథకి అవసరమైన మూలకథని భిన్నంగా ఎంచుకోవడంతో ఈ చిత్రం విడుదలకి ముందే ప్రేక్షకులని ఆకర్షించగలిగింది. ఈ విషయంలో దర్శకుడు మహి ప్రతిభని మేచ్చుకోవలిసిందే.
ఇక విడుదలైన మొదటి ఆట నుండే కాకుండా, ముందు రోజు స్పెషల్ షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం ప్రారంభమైంది. మనుషులకి.. దయ్యాలు భయపడతాయి అన్న రొటీన్ కి భిన్నమైన పాయింట్ ఈ చిత్రానికి వెన్నుముక అని చెప్పాలి.
పేరుకి తాప్సీ ఈ చిత్రానికి లీడ్ రోల్ అని అందరు అనుకున్నా, సినిమా చూసాక మాత్రం- శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, శకలక శంకర్, తాగుబోతు రమేష్ లు మనకి లీడ్ యాక్టర్స్ గా కనిపిస్తారు. వీరు భయం నటిస్తూ అలాగే వారికున్న బలహీనతలతో అభినయించిన తీరు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది.
వీరందరి నుండి ఇంత ప్రతిభని రాబట్టుకున్న దర్శకుడికి అత్యధిక క్రెడిట్ దక్కుతుంది. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. బడ్జెట్ (రెమ్యునరేషన్స్ మినహాయిస్తే) పరంగా చాలా తక్కువ వ్యయంతో తీసిన ఈ చిత్రం నిర్మాతలకి లాభసాటి చిత్రంగా మిగిలిపోనుంది.
మొత్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే, హారర్ సినిమాకి వెళ్ళి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటూ బయటకి రావడం గ్యారంటీ... ఆనందో బ్రహ్మా నిజంగానే ఆనందింపజేస్తుంది.