చూస్తుండగానే మరో వారం గిర్రున తిరిగిపోయింది. ఈ ఏడు రోజుల్లో టాలీవుడ్‌లో చాలా సంగతులే జరిగాయి. నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. కొత్త సినిమా కబుర్లు తెలిశాయి. టైటిళ్లు, రిలీజ్ డేట్లు ఫిక్సయ్యాయి. వాటిపై ఓ విహంగ వీక్షణం..
ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి - సంక్రాంతి వార్‌ని ముందే ప్రకటించేశాడు. జనవరి 8న ఈ సినిమా రాబోతోంది. రాజమౌళి సినిమా సంక్రాంతి బరిలో నిలిచిందంటే... మిగిలిన సినిమాలకు కంగారే. ఎందుకంటే... ఆ సినిమా స్థాయి అలాంటిది. రాజమౌళి ఎప్పుడైతే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడో, అప్పుడే సంక్రాంతికి వద్దామనుకున్న మిగిలిన సినిమాలు వెనక్కి వెళ్లడానికి రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్... సింగిల్ హ్యాండ్‌తో గెలిచేసే అవకాశాలున్నాయి. అయితే మరోపక్క శంకర్ సినిమా భారతీయుడు 2 కూడా సంక్రాంతికి వస్తుందని తెలిసింది. దాంతో రాజమౌళి, శంకర్ మధ్య పోరు మొదలైనట్టే.
చిరంజీవి కొత్త సినిమా టైటిల్ లీకులు ఈ వారంలోనే జరిగాయి. ఈ సినిమాకి `ఆచార్య` అనే పేరు ఫిక్స్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టైటిల్ వివరాలు బయటకు వచ్చినా, చిత్రబృందం కామ్‌గా ఉంది. అంటే.. ఈ టైటిల్ ఓకే అయిపోయే ఛాన్సులున్నాయన్నమాట. పవన్ కల్యాణ్ సినిమాకి `వకీల్ సాబ్` అనే పేరు పెట్టారని, ప్రభాస్ సినిమా టైటిల్ `ఓడియర్`గా మారిందని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఓ స్పష్టత రావాల్సివుంది.
ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన సినిమా.. `జానూ`. తమిళ `96`కి ఇది రీమేక్. 96 అంత గొప్పగా జానూ లేకపోవొచ్చు గానీ, ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ మాత్రం ప్రేక్షకులకు అందివ్వడంలో ఈ సినిమా విజయవంతం అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా శర్వానంద్, సమంత నటనకు మంచి స్పందన వస్తోంది. ఆర్థిక లెక్కలు వేసుకుని చూస్తే... దిల్ రాజు ఖాతాలో మరో హిట్టు చేరినట్టే.
`ఇక నేను ప్రేమ కథలు చేయను` అంటూ విజయ్ దేవరకొండ ఓ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ వారంలో విడుదల అవుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమానే తన చివరి ప్రేమకథా చిత్రమని ప్రకటించాడు. మరి విజయ్ అలా ఎందుకు అన్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఈ సినిమాపై నెగిటీవ్ ఇంప్రెషన్ తీసుకొస్తాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
యువ హీరోలు నితిన్, నిఖిల్ పెళ్లిళ్లు ఈ వారంలో ఫిక్సయ్యాయి. నిఖిల్ నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిపోయింది. నితిన్ కూడా త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకుంటానని నితిన్ ప్రకటించాడు.