నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే.
ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. అప్పట్లో విదేశాలలో ఉన్న రామ్‌చరణ్ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు (ఆదివారం) ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించుకొని 10లక్షల రూపాయల చెక్కు ను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేవు. ఈ సహాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు రామ్‌చరణ్‌తో అన్నారు.
'నూర్ మహ్మద్ తమ కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అని రామ్ చరణ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
45 నిముషాలు నూర్ మహ్మద్ కుటుంబంతో గడిపారు. ఆయన చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు. నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ మీ ఇంటిలో పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటానని, అదే విధంగా నూర్ మహ్మద్ గారి కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని , అంతే కాకుండా అమ్మాయిల పెళ్లిళ్లకు తను స్వయంగా వస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.