చిరంజీవి 150వ సినిమా కోసం చాలా పోటీ నెలకొన్న రోజుల్లో, నిర్మాతలంతా ఆ అవకాశాన్ని దొరకబుచ్చుకోవాలని చూసిన సమయంలో... అల్లు అరవింద్ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. చిరు కెరీర్‌లో గీతా ఆర్ట్స్ ఎన్నో మైలు రాళ్లని అందించింది. అరవింద్ తో సినిమా చేయడంలో చిరుకి ఓ సౌలభ్యం ఉంటుంది. అది సొంత బ్యానర్ కంటే ఎక్కువ. కాబట్టి గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా చేసేస్తారనుకున్న సమయంలో - ఆ ఛాన్స్‌ని ఒడిసిపట్టుకోగలిగాడు చరణ్. కొణిదెల ప్రొడక్షన్ పై ఓ బ్యానర్ స్థాపించి, తండ్రితో సినిమా చేసే అవకాశం తానే దక్కించుకున్నాడు.
151వ సినిమా కూడా తన ఖాతాలో వేసుకోవడం వల్ల 152వ సినిమా వరకూ ఎదురు చూడడం మినహా అల్లు అరవింద్ కి మరో మార్గం లేకుండా పోయింది. అయితే చిరు 152వ సినిమా కోసం అల్లు అరవింద్ ముందే కర్చీఫ్ రెడీ చేసుకున్నారు. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ ఓ సినిమా చేయనుందని, అందులో చిరు కథానాయకుడిగా నటిస్తారని అప్పట్లో అరవింద్ స్వయంగా ప్రకటించారు కూడా. కానీ.. బోయపాటి సినిమా చేజారిపోయింది. ఆ స్థానంలో కొరటాల వచ్చి చేరాడు. ఆ సినిమా కోసం చరణ్ తో మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్స్ జట్టు కట్టింది. దాంతో ఆ ఛాన్సూ అల్లు అరవింద్ చేతుల్లోంచి వెళ్లిపోయినట్టైంది. చిరు చేతిలో మూడు సినిమాలున్నాయిప్పుడు. అందులో ఒక్కటీ గీతా ఆర్ట్స్ చేజిక్కించుకోలేపోయింది. దాంతో.. అల్లు అరవింద్ కాస్త హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ ఇన్నింగ్స్ లో చిరుతో సినిమా చేయాలన్న కోరిక అరవింద్ కి తీరడం లేదు. కనీసం రామ్ చరణ్‌తో అయినా ఓ సినిమా చేయాలని అరవింద్ భావిస్తున్నారు.
అయితే అదీ తీరేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. `ఆర్.ఆర్.ఆర్` తరవాత చరణ్ ఎవ్వరికీ కమిట్ అవ్వలేదు. ఇది వరకే కె.ఎస్.రామారావుకి ఓ సినిమా చేస్తానని చరణ్ ఫిక్సయ్యాడు. మైత్రీ లాంటి సంస్థలు చరణ్‌తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయి. దాంతో గీతా ఆర్ట్స్ చరణ్ సినిమా ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. సొంత నిర్మాణ సంస్థల్లో కంటే బయట వారికి సినిమాలు చేయడానికే చరణ్ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. చిరు రాబోయే సినిమాల నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్ పాలు పంచుకోవడం లేదు. దాంతో అటు చరణ్, ఇటు చిరు.. ఇద్దరు హీరోలు ఉన్నా.. వాళ్లతో సినిమాలు తీసే స్థాయి గీతా ఆర్ట్స్‌కి ఉన్నా - వీలు కావడం లేదు.