తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ ప్రభంజనం. పార్టీ స్థాపించిన ఎనిమిది నెలలకే... అధికారం చేపట్టి, అబ్బుర పరిచిన చరిత్ర ఎన్టీఆర్‌ది. నిజంగా ఈ ఫీట్ ఇది వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే.. ఈ రికార్డుని ఇప్పుడు బద్దలు కొట్టాలన్న తాపత్రయం రజనీకాంత్ లో కనిపిస్తోంది. అడుగడుగునా రజనీకాంత్ ఎన్టీఆర్ స్టైల్‌ని ఫాలో అవ్వబోతున్నారని తమిళ నాట రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
రజనీకాంత్ తన పార్టీని డిసెంబరు 31న ప్రకటించబోతున్నారు. అంటే... అప్పటికి తమిళనాడు ఎన్నికలకు మరో 5 నెలల సమయం ఉంటుందన్న మాట. రజనీ గెలిస్తే, తన పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్టీఆర్ రికార్డుని బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మరో విషయంలోనూ ఎన్టీఆర్‌ని ఫాలో అవ్వాలని రజనీకాంత్ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్. ఆ గుర్తుతో జనంలోకి వెళ్లారు ఎన్టీఆర్. ఇప్పుడు అదే గుర్తుతో.. రజనీకాంత్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనులకుంటున్నార్ట. సైకిల్ గుర్తుని ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో రజనీ ఉన్నట్టు భోగట్టా. రజనీకాంత్ పార్టీ గుర్తు సైకిల్ అని.. తమిళ నాట అప్పుడే ప్రచారం మొదలైంది. సైకిల్ అనేది సామాన్య ప్రజానికానికి, వాళ్ల జీవితానికి ప్రతీక. అందుకే అప్పట్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించగలిగారు. అందుకే రజనీ సైతం.. అదే గుర్తుపై మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.