ఓ మాస్ సినిమా వస్తే... అదిచ్చే కిక్కే వేరు. సినిమా కాస్త అటూ ఇటూగా ఉన్నా, మాస్ బ్రహ్మరథం పడుతుంటారు. బీ, సీలలో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ విషయంలోనూ అదే జరుగుతోంది. పూరి - రామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. గురువారం విడుదలైంది. చాలా రోజుల తరవాత.. వచ్చిన మాస్ సినిమా కావడం, టీజర్లు, ట్రైలర్లు, పాటలు విడుదలకు ముందే హోరెత్తించడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
తొలి రోజు ఏకంగా 7.8 కోట్ల షేర్ తెచ్చుకుంది. రామ్ కెరీర్‌లో ఇదే రికార్డు. నైజాంలో 3.43 కోట్లు, సీడెడ్‌లో 1.2 కోట్లు, విశాఖ నుంచి 86 లక్షలు సంపాదించింది ఈ చిత్రం. తొలి రోజే పంపిణీదారులకు సగం రెవిన్యూ లభించడం విశేషం. శుక్ర, శని, ఆదివారాలూ.. ఇస్మార్ట్ శంకర్ ఇదే జోరు చూపిస్తే... ఇక శంకర్ ని సూపర్ హిట్ ఖాతాలో చేర్చేయొచ్చు. చాలా కాలం తరవాత పూరి సినిమాకి ఈ స్థాయిలో బజ్, ఇన్ని వసూళ్లు దక్కాయి. మొత్తానికి పూరి ఈజ్ బ్యాక్... అన్నమాట.