డబ్బుల కోసం సినిమాలు తీస్తావా? నీ కోసం నువ్వు సినిమాలు తీసుకుంటావా? అని అడిగితే.. `నా కోసమే` అని సమాధానం ఇస్తుంటాడు పూరి. సినిమాల్లో సంపాదించాడు. ఆ సంపాదించినదంతా సినిమాల్లోనే పోగొట్టాడు. గత కొన్నేళ్లుగా పూరి డబ్బులు పోతూనే ఉన్నాయి. టేబుల్ ప్రాఫిట్ అనే మాట పూరి అస్సలు వినలేదు. ఇంత కాలానికి మళ్లీ పూరి సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. టేబల్ ప్రాఫిట్ కూడా వచ్చేసింది.
అదే ఇస్మార్ట్ శంకర్. రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. సినిమాలో మాస్, మసాలా అంశాలు దట్టంగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. రామ్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయినట్టు కనిపిస్తోంది. అందుకే ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా థియేటరికల్ రైట్స్ 17 కోట్లకు అమ్మేశారు. డిజిటల్, శాటిలైట్ బిజినెస్ కలుపుకుంటే దాదాపు 30 కోట్ల బిజినెస్ ఖాయం.
పూరి - రామ్ కాంబోపై ఈ స్థాయి బిజినెస్ జరగడం గ్రేటే. గురువారం ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే మల్టీప్లెక్స్‌లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బాక్సాఫీసు ముందుకు మంచి మాస్ మసాలా సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇస్మార్ట్ ఏమాత్రం బాగున్నా - వసూళ్ల దుమ్ము దులపడం ఖాయం. అందుకే పూరి ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఈమధ్య కాలంలో తన సినిమాకి రానటువంటి పాజిటీవ్ బజ్ ఈ సినిమాకి రావడంతో పండగ చేసుకుంటున్నాడు. సినిమా హిట్టయితే పూరి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసినట్టే.