పూరి ఫామ్ కోల్పోయి చాలా కాలం అయ్యింది. మధ్యలో 'టెంపర్'తో ఓ మెరుపులా మెరిశాడు. అయితే... ఆ జోరు ఆ సినిమాకే పరిమితం అయ్యింది. రామ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ఓ అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నాడు. ఓ సినిమా హిట్టయితే.. రెండు మూడు ఫ్లాపులు వరుస కడుతున్నాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్'కి ఎలాంటి హైప్ లేకుండా పోయింది. దానికి తోడు.. ఈ సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తోంది.
'ఇస్మార్ట్ శంకర్' బడ్జెట్ దాదాపు 18 కోట్ల వరకూ అయ్యింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. థియేటరికల్ రైట్స్ రూపంలో రూ.25 కోట్లు వస్తే గానీ.. ఈ సినిమా గట్టెక్కదు. కానీ.. 12 కోట్లకు బేరం పలుకుతోందట. అందుకు మించి పైసా కూడా ఇవ్వనని బయ్యర్లు చెబుతున్నార్ట. దాంతో ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఏదో ఒకటి చేసి ఈ సినిమాకి హైప్ పెంచాలని పూరి భావిస్తున్నాడు. ఈ సినిమాకి హైప్ వస్తే తప్ప... రేటు పెరిగే అవకాశం లేదు. మరి పూరి ఏం మంత్రం వేస్తాడో చూడాలి.