అన్నీ అనుకూలిస్తే, సంక్రాంతికి పెద్ద సినిమాల జాతర వుండాలి. కానీ, ఆయా పెద్ద సినిమాల నిర్మాతలెవరూ సంక్రాంతి రిలీజ్ విషయమై ఆసక్తి చూపడంలేదట. నేటి నుంచి సినిమా థియేటర్లు తెలంగాణలో తెరచుకున్న విషయం విదితమే. 'సినిమా థియేటర్లకు రండి..' అంటూ ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, సినిమా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోవడంలేదు. కేవలం సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు తెరచుకుంటున్నాయి. కానీ, సినిమా అంటే ఆ కథ వేరే వుండాలి.
థియేటర్ల ముందు హంగామా లేకుండా, సినిమా ఫీల్ ఎలా వస్తుంది.? థియేటర్లు ఫుల్ అయిపోవాలి.. థియేటర్ల చుట్టూ జనం గుమికూడాలి. కానీ, ఇవేవీ ప్రస్తుత పరిస్థితుల్లో జరగవు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని, థియేటర్లకు వెళ్ళి సైలెంటుగా సినిమా చూసి వచ్చేయడమే. అది కూడా. 50 శాతం ఆక్యుపెన్సీ అంటే.. అటూ ఇటూ ఇంకో మనిషి వుండడన్నమాట. ఒక కుర్చీ ఖాళీగా వదిలేసి, అవతలి కుర్చీలో మాత్రమే ఇంకో ప్రేక్షకుడు వుంటాడు.
ఇలా సినిమా చూడటాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు.? ఒకవేళ ఇష్టపడినా, సగం ఆదాయంతో ఏ సినిమా అయినా సంతృప్తి చెందుతుందా.? ఛాన్సే లేదు. దానికన్నా ఇంట్లో కూర్చుని, కుటుంబ సమేతంగా ఓటీటీలో సినిమా చూసెయ్యడం మేలన్న భావనకి ప్రేక్షకులు వచ్చేశారు. అయితే, సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ప్రత్యేకమైనది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రిలీజైతే, ప్రేక్షకుల నాడి ఏంటన్నది తెలుస్తుంది. అయినాగానీ, సంక్రాంతికి పెద్ద రిలీజులు కష్టమే.. కష్టం కాదు, అసాధ్యం అంటున్నారు సినీ జనాలు.