'మా'లో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. `మా`లో సభ్యుల మధ్య సఖ్యత లేదని, ఒకే ప్యానల్‌లో గెలిచి, ఒకే కమిటీలో ఉన్నవాళ్లు సైతం ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారని తెలియడంతో `మా` సమస్యలు మళ్లీ బయటకు వచ్చాయి. `మా` ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి నరేష్ వర్గం, రెండోది రాజశేఖర్ వర్గం. నరేష్, రాజశేఖర్‌లు ఇద్దరూ ఒకే ప్యానల్‌లో గెలిచినవాళ్లే. నరేష్ అధ్యక్షుడు అయితే, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే వీళ్లలో వీళ్లకు సఖ్యత లేదు.
`నరేష్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, నిధులు కూడా మాయం అవుతున్నాయ`న్నది ప్రధాన ఆరోపణలు. అసలు మాలో ఏం జరుగుతోంది, ఏం చేస్తే ఓ పరిష్కారం లభిస్తుంది? అనే విషయమై చర్చించడానికి కృష్ణంరాజు `మా` సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. సభ్యులంతా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నారు.
కానీ ఈ సమావేశంలోనూ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. రచయిత పరుచూరి గోపాలకృష్ణ సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయారు. ఫృథ్వీ కూడా... `మా` పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తానికి మాలో మళ్లీ ముసలం మొదలైంది. అది ఇప్పట్లో ఆరేట్టు లేదు. ఈ రెండు వర్గాల పోరు `మా`ని ఎక్కడి వరకూ తీసుకెళ్తుందో చూడాలి.