ఈమధ్య ఆదాయ శాఖ కన్ను సినిమా ఇండ్రస్ట్రీపైనే ఫోకస్ అయ్యింది. పెద్ద సినిమాలేమైనా విడుదలైతే చాలు.. టంచనుగా ఆయా సినిమాలకు సంబంధించిన ఆఫీసులపై దాడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున పత్రాలు స్వాధీనం చేసుకొంటున్నారు. అందుకే సినిమా వాళ్లు ఇప్పుడు కలక్షన్ల వివరాలు చెప్పడానికి సైతం భయపడుతున్నారు. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాతలు, పంపిణీదారుల ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. ఐటీ శాఖ తదుపరి దాడి... ఖైదీ నెం.150పైనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన చిరు సినిమా... దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. తొలి ఆరు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ తెచ్చుకొందన్న విషయం చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి మరీ తేల్చేసింది. అయితే ఆ తరవాత వసూళ్ల వివరాలేం బయటకు రాలేదు. ఇదంతా ఐటీ శాఖని భయపడే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఐటీ శాఖ ఫోకస్ అంతా.. ఖైదీ సినిమాపై ఉందని, ఈరోజో రేపో సోదాలు తప్పవన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.