పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతుంటే, ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం పరిపాటే. తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'వెంకీ మామ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అగ్ర నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత అయిన సురేష్ బాబుపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆఫీస్‌లోని పలు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్‌లను అధికారులు పరిశీలించారు. సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలన్నింట్లోనూ ఈ సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనూ ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా సురేష్ ప్రొడక్షన్స్‌కి సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో, ఆదాయ పన్ను శాఖ ఈ ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ మధ్య సురేష్ బాబు డైరెక్ట్ మూవీస్ నిర్మాణాల జోలికి పోవడం లేదు. ఒకటీ అరా ఫ్యామిలీ హీరోలైన వెంకీ, రానాల సినిమాలను నిర్మిస్తోంది. ఆ కోవలోనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'వెంకీ మామ' రూపొందింది.
మరోవైపు ఇటీవల పలు చిన్న సినిమాలకు సురేష్ బాబు సమర్పకునిగా వ్యవహరిస్తూ, ఆయా సినిమాల రిలీజ్‌లకు సహకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, కొందరు స్టార్ హీరోలపై కూడా ఈ సోదాలు జరగనున్నట్లు సమాచారం.