ఆదాయపు పన్ను శాఖ అదికారుల తనిఖీలు నిరంతరం జరుగుతుంటాయి. సినీ పరిశ్రమలోనూ ఈ తరహా తనిఖీలు సర్వసాధారణమే. అయితే, సినీ పరిశ్రమకి ఎక్స్పోజర్ ఎక్కువ కావడంతో, ఇక్కడ ఐటీ తనిఖీలు జరిగితే అదో పెద్ద సంచలనమే అవుతుంది. తమిళ హీరో విజయ్‌పై ఐటీ సోదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం గమనార్హం. ఆ ఎఫెక్ట్ తెలుగు సినీ పరిశ్రమ మీద కూడా పడుతోంది. టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలపై ఐటీ శాఖ కన్నేసిందంటూ ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది.
ఈ మధ్య వసూళ్ళ పేరుతో జరుగుతున్న ‘ఓవర్ పబ్లిసిటీ స్టంట్లు’ సహజంగానే ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో ఆయా సినీ ప్రముఖులు పడేందుకు ఆస్కారమేర్పడుతుంది. ‘బాహుబలి’ సినిమా టైంలో ఆ చిత్ర నిర్మాతల కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగిన విషయం విదితమే. ఏదన్నా పెద్ద సినిమా రిలీజ్ అవుతోందంటే, సరిగ్గా ఆ టైంలోనే ఈ తరహా సోదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈసారి తనిఖీలు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. సినిమాల పబ్లిసిటీ కోసం ప్రచారంలోకి తెచ్చే కలెక్షన్ల నెంబర్లకీ, వాస్తవ లెక్కలకీ చాలా తేడాలుంటాయని చాలామంది సినీ ప్రముఖులు చాలాసార్లు చెప్పారు. అయితే, ట్రెండ్ మారింది. హీరోలు, సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో లాభాల్ని చవిచూస్తున్నారు. ఒక్కోసారి నష్టపోతున్నారు కూడా. మరి, ఇవన్నీ ఐటీ శాఖ సినీ పరిశ్రమ వైపు చూసేలా చేస్తున్నాయా? అనేదీ ఆలోచించాల్సిన విషయమే.