మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది.. ఏపీలో చిత్రసీమ పరిస్థితి. అసలే అక్కడ టికెట్‌రేట్లు తగ్గిపోయాయి. దానికి తోడు 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ నడుస్తోంది. ఇలాంటి దశలో ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ పోర్టల్ ని ప్రభుత్వమే నడిపిస్తుందని, నెలాఖరుకి ఆ వసూళ్లు నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబీటర్లకు పంచుతుందని ఓ జీవో విడుదల చేసింది. ఈ జీవో హాస్యాస్పదంగా ఉందని చిన్న పిల్లాడైనా చెప్పేస్తాడు. టికెట్ బుకింగ్ వ్యవస్థ ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లడమేంటి? ప్రభుత్వం డబ్బులు పంచడమేంటి? ఇది జరిగే వ్యవహారం కాదు. పైగా నిర్మాతలకు, పంపిణీదారులకు డబ్బులు నేరుగా రావు.
ప్రేక్షకుడి నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారి.. నెలాఖరుకి ఎప్పుడో వస్తుంది. ఇంత జాప్యం ఎందుకు? ఈ నిర్ణయాన్ని ఎవరూ సమర్థించరు. కానీ... గళం ఎత్తేవాళ్లెవరు? ఆధైర్యం మన నిర్మాతలకు ఉందా? ఇప్పటికే జగన్ ప్రభుత్వం తమని కనికరించడం లేదని బాధ పడిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై గొడవ చేసి మరింత దూరం పెంచుకుంటారా? ప్రభుత్వ నిర్ణయం అమలు చేయడం చాలా కష్టమని, ఎలాగూ ఇది వర్కవుట్ కాదని చాలామంది ఉద్దేశం. ఎలాగైనా సరే.. ఈ వ్యవహారంపై ఎవరో ఒకరుకోర్టుకి వెళ్తారు. అక్కడ కోర్టు స్టే ఇస్తుంది. ఆ తరవాత.. చూసుకుందాంలే అనుకుంటున్నారు నిర్మాతలు. పొరపాటున కోర్టు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తే... ఇక చేసేదేం లేదు.